Copyrights Reserved © 2026

prajayuddanouka.com

BREAKING NEWS

తెలంగాణ - తాజా వార్తలు

thumb
దేవరకొండలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి నల్లగొండ డీటీడీఓ పి. కమలాకర్ రెడ్డి ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ, ఆగస్టు 11): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల (బాలికలు) లో వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 80 మంది ఆదివాసీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన ఆదివాసీలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అనంతరం వారి సంస్కృతి, సంప్రదాయాల విశిష్టత, ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఆదివాసీ సమాజం తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆచారాలు, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని వక్తలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్లగొండ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి (డీటీడీఓ) పి. కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన సమాజ అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులకు సమర్థవంతంగా అందించాలని అధికారులకు సూచించారు. ఆదివాసీల విశిష్టమైన సంస్కృతిపై నేటి యువతలో మరింత అవగాహన పెంపొందించాలని, వారి హక్కులు, ఆత్మగౌరవం, సర్వాంగీణ వికాసం కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ఏటీడీఓ ఎం. శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (హెచ్‌ఎం) ఎ. కవిత, హెచ్‌డబ్ల్యూఓ ఈ. శేఖర్ రెడ్డిలతో పాటు పలువురు ట్రైబల్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఎంలు, హెచ్‌డబ్ల్యూఓలు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

thumb
రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాన్ని పరామర్శించిన మైనంపల్లి హనుమంతరావు: రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేత

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (మెదక్/ పాపన్నపేట): మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ సోదరుడైన ఆకుల కృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మైనంపల్లి హనుమంతరావు మంగళవారం వారి నివాసానికి వెళ్లి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిస్తూ రూ. 2,00,000/- (రెండు లక్షల రూపాయల) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం దివంగత ఆకుల కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ గౌడ్ తో పాటు ఇతర స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

thumb
రైతన్న ఇంట సంతోషం కోసమే మహా వరుణయాగం: ఎమ్మెల్యే బాలు నాయక్

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ): రాష్ట్రంలో పసిడి పంటలు పండాలి.. రైతన్న ఇంట సంతోషం వెల్లివిరియాలి అన్న తపనతో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మహావరుణ యాగం నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ తీరాన వేద మంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా సంపూర్ణమైంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం ఆధ్వర్యంలో జరిగిన ఈ విశిష్ట ఆధ్యాత్మిక క్రతువులో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ యాగ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే బాలు నాయక్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బాలు నాయక్.. ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ వర్షాలపై నెలకొన్న ఆందోళనలను అధిగమించేందుకు ప్రభుత్వం ఆధ్యాత్మిక విధానంతో పాటు శాస్త్రీయ దృక్పథంతో ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తోందని వెల్లడించారు. సమృద్ధిగా వర్షాలు కురిస్తే నాగార్జునసాగర్ ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు నిండి భూగర్భ జలాలు పెరుగుతాయని పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు సమృద్ధిగా అందడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలకు ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

thumb
సాగర తీరాన వాన దేవునికి వైదిక నీరాజనం: జల సిరుల కోసం మహావరుణ యాగం జరిపించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ నాగార్జునసాగర్): ర్రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, జలాశయాలన్నీ జలకళతో నిండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం తలపెట్టిన ‘మహా వరుణయాగం’ నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ ప్రాంగణంలో కృష్ణా నదీ తీరాన వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. ఈ పవిత్ర యాగంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొని, రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగ క్రతువులను నిర్వహించి సంపూర్ణ పూర్ణాహుతి సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో, 11 హోమగుండాల నడుమ వరుణదేవుని అనుగ్రహాన్ని కాంక్షిస్తూ వైదిక విధానంలో హోమక్రతువులను నిర్వహించారు. ఈ దివ్య యాగంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు సైతం పాల్గొని పూజా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్ నినో ప్రభావంతో ఈసారి రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందనే సంకేతాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ ముందస్తు ఆధ్యాత్మిక సంకల్పాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం ఈ వరుణ యాగాన్ని నిర్వహించిందని వివరించారు. భారతీయ సంస్కృతిలో వర్షాల కోసం యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయమని గుర్తుచేసిన సీఎం, ఒకవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తూనే, ప్రకృతి, మానవ జీవితం, వ్యవసాయాల పరస్పర సంబంధాన్ని ప్రతిబింబించే సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతి అనుగ్రహాన్ని వేడుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వరుణదేవుడిని ప్రార్థిస్తూ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లతో పాటు అన్ని ప్రధాన ప్రాజెక్టులు సమృద్ధిగా నిండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి చెరువు, ప్రతి కుంట జలకళతో కళకళలాడాలని, భూగర్భ జలాలు పెరిగి పంటలు పుష్కలంగా పండాలని, తద్వారా రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పవిత్ర ఆధ్యాత్మిక మహోత్సవంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవ రావు,  పి. సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నాయకులు, కార్యకర్తలు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

thumb
సమాజానికి వెన్నెముక రైతు: ఎంఎన్ స్కూల్ లో ఆకట్టుకున్న ప్రదర్శన

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ ): దేవరకొండ పట్టణంలోని ఎంఎన్ స్కూల్‌ (MN SCHOOL’S) లో రైతుల కష్టాలు, వ్యవసాయ రంగం ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్నిశుక్రవారం ఘనంగా నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పంట నష్టాలు, కుటుంబ పోషణకు వారు పడుతున్న అవస్థలను 5, 6వ తరగతి విద్యార్థులు నాటిక రూపంలో అద్భుతంగా ప్రదర్శించి అందరినీ ఆలోచింపజేశారు. ఈ సందర్భంగా ఎంఎన్ విద్యాసంస్థల చైర్మన్, కరస్పాండెంట్ పొలోజు నరేష్ చారి మాట్లాడుతూ రైతు శ్రమ ఫలితంగానే మనకు అన్నం దొరుకుతుందని, విద్యార్థులు రైతుల కష్టాన్ని గుర్తించి ఆహారాన్ని వృథా చేయకూడదని సూచించారు. కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా విద్యార్థులలో సామాజిక బాధ్యత, మానవతా విలువలు పెంపొందించేందుకు ప్రతి వారం ఇలాంటి ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతుల పరిస్థితిని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించిన విద్యార్థులను, కార్యక్రమ నిర్వహణకు కృషి చేసిన పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని, యాజమాన్యాన్ని, పాఠశాల సిబ్బందిని   స్థానికులు, విద్యారుల తల్లిదండ్రులు అభినందించారు.

thumb
సతీష్ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి

ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ ): నేరడుగొమ్ము మండలం పడమటి తండాకు చెందిన నేనావత్ సతీష్ అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పడమటి తండాలో సతీష్ భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి అశ్రునయనాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సతీష్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో సతీష్ కుటుంబానికి నిరంతరం అండగా ఉంటామని భరోసానిచ్చారు. సతీష్ భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో మాజీ PACS చైర్మన్ ముక్కమల్ల బాలయ్య, మాజీ వైస్ ఎంపీపీ అరేకంటి రాములు, పల్స వెంకటయ్య, కుంటిగోర్ల నాగరాజు, మంగ్య నాయక్ తదితర నాయకులు ఉన్నారు.