Copyrights Reserved © 2026
prajayuddanouka.com
(హైదరాబాద్ , తెలంగాణ): రాష్ట్రంలో గతంలో నిర్వహించిన ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ రికార్డుల ట్యాంపరింగ్, అక్రమ భూ మార్పిడులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ధరణి ప్రారంభమైన 2020 అక్టోబరు 29 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబరు వరకు జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై లోతైన విచారణకు ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ 'సిట్' బృందానికి ఏసీబీ అదనపు డీజీ చారు సిన్హా నేతృత్వం వహించనుండగా, బృందంలో రెవెన్యూ అధికారులు, ఐటీ నిపుణులు, సైబర్ క్రైమ్ విచారణలో అనుభవం ఉన్న పోలీస్ అధికారులను సభ్యులుగా చేర్చనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నాయి.ప్రధానంగా విచారించే అంశాలు: 10 వేలకు పైగా అనుమానాస్పద లావాదేవీలు: కేరళ ప్రభుత్వ సంస్థ (KSAAC) నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో వెలుగుచూసిన 10,000 కంటే ఎక్కువ వివాదాస్పద లావాదేవీలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. 22A దుర్వినియోగం: పేదల అసైన్డ్ భూములు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, సీలింగ్ భూములను నిషేధిత జాబితా (22A) నుంచి అక్రమంగా తొలగించి బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వ్యవహారాలను సర్వే నంబర్ల వారీగా పరిశీలిస్తారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ అక్రమాలు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోనే అత్యధికంగా ప్రభుత్వ, సీలింగ్ భూములు చేతులు మారినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రికార్డులు తారుమారు చేసి అక్రమాలకు పాల్పడిన ఎంతటి వారిపైనైనా క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర విషాదం: తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ స్వామి తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం ఉదయం 5:30 గంటల సమయంలో కానిస్టేబుల్ స్వామి వాష్‌రూమ్‌కు వెళ్లి, అక్కడ తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. తుపాకీ శబ్దం విన్న తోటి సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకోగా, స్వామి రక్తమడుగులో పడి ఉన్నారు. ఘటనా స్థలంలో పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో "నా భార్య, పిల్లలను ఏమీ అనవద్దు" అని స్వామి రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ కలహాల కారణంగానే స్వామి ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ మేడ్చల్ మల్కాజ్గిరి (చర్లపల్లి):: అత్యవసర సమయాల్లో భద్రతా వ్యవస్థల సన్నద్ధతను పరీక్షించేందుకు చర్లపల్లిలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ప్రాంగణంలో మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో గురువారం సెక్యూరిటీ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ సందర్భంగా అత్యంత కీలకమైన ఈ సంస్థ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఏదైనా ఆకస్మిక ప్రమాదం లేదా భద్రతా సమస్య తలెత్తితే వేగంగా స్పందించేందుకు వీలుగా భద్రతా ఏర్పాట్లను మరియు పోలీసు బలగాల సన్నద్ధతను అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి పోలీసులు మాట్లాడుతూ... "సురక్షిత సమాజ స్థాపన కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండటమే మా మొదటి ప్రాధాన్యం. అప్రమత్తతే రక్షణకు మూలస్తంభం" అని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు కూడా ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
(తెలంగాణ): హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అధ్యాపకులు మందలించారంటూ.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్: ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపైనా, యువతపైనా లాఠీఛార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించడాన్ని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్‌లో వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన లోక్‌భవన్ ముట్టడిపై తెలంగాణ ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి విద్యార్థి నేతలు, విద్యార్థులు ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో, వారు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అరెస్టులకు పూనుకోవడంతో తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నేతలను, విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. అరెస్టు చేసిన వారిని ఆసిఫ్‌నగర్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై సోమవారం హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన స్థలంలోకి వెళ్లరాదన్న ఆదేశాలను మూడుసార్లు ధిక్కరించినందుకు అరెస్టు చేయాలని కూడా ఆదేశించింది. ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తితో అరెస్టు ఆదేశాలను విరమించుకున్నప్పటికీ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆయన సాయంత్రం 6.30 గంటలకు జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం రంగనాథ్ వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలవాటుపడ్డ నేరగాడిలా మారారని వ్యాఖ్యానించింది. మల్కాజ్‌గిరి మండలం లోతుకుంటలోని సర్వే నెంబర్లు 1, 2లలో ఉన్న భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, శాంత శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. సివిల్ సూట్, మొదటి అప్పీల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది. అయినప్పటికీ ఆ భూమిలో ప్రభుత్వం హైడ్రా ద్వారా జోక్యం చేసుకుంటోందని పేర్కొంటూ రెండుసార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ భూమిలోకి ఎట్టిపరిస్థితుల్లో ప్రవేశించరాదని రెండు సార్లు కూడా హైకోర్టు గట్టి హెచ్చరిక జారీచేసింది. అయినప్పటికీ మూడోసారి కూడా హైడ్రా తమ భూముల్లోకి ప్రవేశించడమే కాకుండా ఈసారి తమపై అక్రమంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించిందని పేర్కొంటూ ఆ సంస్థ యజమానులు హైకోర్టులో మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్‌మోషన్ రూపంలో ఈ పిటిషన్ జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. సాయంత్రం విచారణకు హాజరైన రంగనాథ్... కోర్టు ధిక్కరణదారులకు కేటాయించిన కోర్టు చివరిభాగంలోనే నిలబడ్డారు.హైడ్రా తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం.. హైడ్రా కమిషనర్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది. హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించడం చెల్లదు. కోర్టు ఆదేశాలంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారు. అది ప్రైవేటు భూమి అని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అది నచ్చకపోతే చట్టప్రకారం సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలి. అంతేగానీ కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ప్రైవేటు భూమిలోకి వెళ్లి విధ్వంసం సృష్టించడం ఏమిటి? ఒక్కసారి కాదు మూడుసార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. న్యాయవ్యవస్థతో తలపడాలని చూస్తున్నట్లు ఉన్నారు. పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ఆయన అలవాటుపడ్డ నేరగాడిలా మారారు. ఏ కారణంతో పిటిషనర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు? ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదంటే కావాలని చేసినట్లే కదా? హైడ్రా కమిషనర్ వైఖరి అర్థరహితం.. అరాచకం. కోర్టు చెప్పిన తర్వాత కూడా అనుకున్నదే చేస్తానన్న వైఖరి గర్హనీయం’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి చేయడంతో అఫిడవిట్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చిన హైకోర్టు.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్ (నారాయణగూడ): విద్యా రంగంలో తనదైన విశిష్ట గుర్తింపు పొందిన నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ (KMES) 86వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సంస్థ ప్రాంగణంలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆడిటోరియంలో సోమవారం అత్యంత వైభవంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యాసంస్థలు సమాజ వికాసానికి, నైతిక విలువల పెంపొందింపునకు పట్టుకొమ్మలుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి కేఎంఈఎస్ అధ్యక్షుడు, పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, కేఎంఈఎస్ ఉపాధ్యక్షులు సిఏ జె. నరసింహారావు, కార్యదర్శి డాక్టర్ ఎ.వి. సుబ్రహ్మణ్యం, కోశాధికారి ఎల్. ప్రభాకర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి బి. శ్రీధర్ రెడ్డి తదితర ప్రముఖులు సభను అలంకరించారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ, పీజీ (PG) మరియు వృత్తి విద్యా కోర్సుల వరకు వివిధ విభాగాల్లో, గ్రూపుల్లో అద్భుత ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు గవర్నర్ మరియు ఇతర అతిథుల చేతుల మీదుగా బంగారు పతకాలు (Gold Medals), నగదు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఈ సందర్భంగా అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ నిర్వహణలోని వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని మహోత్సవంగా విజయవంతం చేశారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్ (కొత్తపేట): పదవ తరగతి ఫలితాల్లో మెరిట్ మార్కులు సాధించి, తన పేరుకు తగ్గట్టుగానే అక్షర జ్ఞానంతో అద్భుత విజయాన్ని అందుకున్న రొడ్డ అక్షరను ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కమిటీ ఘనంగా సత్కరించింది. కొత్తపేటలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంగా అక్షరతో పాటు, ఆమె ఉన్నత విజయానికి కారణమైన తల్లిదండ్రులను కూడా సంఘం ప్రతినిధులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. గ్రామీణ, మధ్యతరగతి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన అక్షర ప్రతిభను నేతలు కొనియాడారు. బిడ్డను ఉన్నతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కృషి అభినందనీయమని వారు పేర్కొన్నారు. ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (PPL) వ్యవస్థాపక అధ్యక్షులు మచ్చ నరసన్న మార్క్స్ అంబేద్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ర్యాంకులు సంపాదించిన విద్యార్థిని విద్యార్థులకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మామిడి పూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి, అతిధులుగా పోలీస్ ఇన్స్పెక్టర్ నాగమల్లు, చైతన్యపురి పోలీస్ ఇన్స్పెక్టర్ సైదులు మరియు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.