Copyrights Reserved © 2026
prajayuddanouka.com
ప్రజాయుద్ధనౌక (ప్రత్యేక ప్రతినిధి): బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సంస్థాగత బలోపేతం, దేశంలో బహుజన ఉద్యమ విస్తరణ మరియు రాబోయే ఎన్నికల కార్యాచరణే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పార్టీ జాతీయ సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సామాజిక పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, బహుజన హక్కుల పరిరక్షణ కోసం గ్రామస్థాయి కమిటీలను చురుగ్గా నడిపిస్తూ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు సాగించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ఇన్‌ఛార్జులు, చీఫ్ సెంట్రల్ సెక్టార్ కోఆర్డినేటర్లు అతర్ సింగ్ రావు, సురేష్ ఆర్యల పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకత్వంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇందులో స్టేట్ కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రామ్ శేఖర్, ఉపాధ్యక్షుడు శ్రీరామ కృష్ణ, చీఫ్ జోనల్ ఇన్‌ఛార్జులు దాగిల్ల దయానందరావు, బోడపట్ల ఈశ్వర్, నిషాని రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీ కమిటీల పునర్నిర్మాణం, క్షేత్రస్థాయి కార్యాచరణ, భవిష్యత్ ఎన్నికల సన్నద్ధతపై వారు జాతీయ అధ్యక్షురాలికి సమగ్ర నివేదిక సమర్పించారు. బహుజన రాజ్యాధికార సాధన దిశగా ఐక్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర నాయకత్వాన్ని అధినేత్రి ఆదేశించారు.
★ పరీక్షలకు ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో.. ఎన్నికలకు పార్టీ కమిటీలు అంతే ముఖ్యం★ గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలి★ సమాన ఓటు హక్కు కల్పించిన ఘనత బాబాసాహెబ్ అంబేడ్కర్‌దే★ మెదక్ పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశంప్రజాయుద్ధనౌక ప్రతినిధి (మెదక్, ఆగస్టు 21): సరైన సన్నద్ధత (ప్రిపరేషన్) లేకుండా పరీక్షలు రాస్తే విద్యార్థులు ఎలాగైతే ఫెయిల్ అవుతారో, బూత్ మరియు సెక్టార్ కమిటీలను పూర్తి చేయకుండా పార్టీని ముందుకు నడపలేమని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ స్పష్టం చేశారు. రామచంద్రాపురంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మెదక్ పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీని తిరుగులేని రాజకీయ శక్తిగా నిలబెట్టేందుకు క్షేత్రస్థాయి నుంచి కమిటీల నిర్మాణం వేగవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు ఇబ్రాం శేఖర్ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పార్టీని పటిష్టం చేసేందుకు నాయకులందరూ సమన్వయంతో కలిసికట్టుగా శ్రమించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు ఎలాంటి ఆస్తి, విద్య లేదా పన్ను చెల్లింపు నిబంధనలతో సంబంధం లేకుండా సమానమైన ఓటు హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్‌కే దక్కుతుందని గుర్తుచేశారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న బీఎస్పీకి మద్దతుగా ప్రజలను చైతన్యవంతం చేయాలని, ఇతర సాంప్రదాయ రాజకీయ పార్టీల విధానాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. ఈ సమావేశంలో విశిష్ట అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చీఫ్ జోన్-3 ఇన్ఛార్జ్ బోడపట్ల ఈశ్వర్, జోన్ ఇన్ఛార్జ్ లింగంపల్లి యాదగిరి పాల్గొన్నారు. వీరితో పాటు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మోహన్ బాబు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సతీష్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఉమేష్, మెదక్ జిల్లా అధ్యక్షుడు శంకర్ మరియు వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (మేడ్చల్ మల్కాజ్గిరి/ మేడిపల్లి): పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసానిచ్చే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. మాజీ మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డిల నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసనలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జక్క వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలను ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక ఆసరాగా నిలిచేందుకు ఈ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఎన్నికల్లో ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, పేదలకు అందుతున్న పథకాలను కూడా కొనసాగించలేక చేతులెత్తేయడం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు, కేసుల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్న ప్రభుత్వ పెద్దలు, పేద మహిళలకు సంబంధించిన ఈ పథకాల రక్షణ కోసం హైకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించే న్యాయవాదులను నియమించకపోవడం వారి నిర్లక్ష్య వైఖరిని తేటతెల్లం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, పేదల సంక్షేమానికి గండికొట్టేలా వ్యవహరించడం సమంజసం కాదని నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే నైపుణ్యం కలిగిన న్యాయవాదులను ఏర్పాటు చేసి కోర్టులో సరైన వాదనలు వినిపించాలని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిరంతరాయంగా కొనసాగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రఘువర్దన్‌రెడ్డి, లేతకుల రఘుపతిరెడ్డి, శ్రీధర్‌గౌడ్, కొత్త రవిగౌడ్, మీసాల కృష్ణ, కొత్త చక్రపాణిగౌడ్, రాజిరెడ్డి, పైల్ల ప్రభాకర్‌రెడ్డి, మహేష్ నిర్మల, కౌడె పోచయ్య తో పాటు మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) జనరల్ సెక్రటరీ కే.సి. వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ నియామకానికి ఆమోదం తెలిపినట్లు, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రజాయుద్ధనౌక (ప్రత్యేక ప్రతినిధి): సినీనటి త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఎం.ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాత విచారణ పూర్తి చేసి బెయిల్‌పై విడుదల చేయడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.కావేరీ జల వివాదంపై తంజావూరులో ఉదయనిధి నాయకత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఈ వివాదం మొదలైంది. కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు రిజర్వాయర్ ప్రాజెక్టును అడ్డుకోవాలని, రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, డెల్టా జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డీఎంకే ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. అయితే, ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో జనసమూహం నుంచి కొందరు నటి త్రిష పేరును ప్రస్తావించగా, ఆయన ద్వంద్వార్థం వచ్చేలా మాట్లాడారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఉదయనిధి తీవ్రంగా ఖండించారు. తన ప్రసంగాన్ని కొందరు ఎడిట్ చేసి వక్రీకరించారని, ఈ అంశంపై చట్టపరంగా పోరాడతానని స్పష్టం చేశారు.ఉదయనిధి అరెస్టుపై ఆయన తండ్రి, డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ సీఎం విజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయ్ ఒక అసమర్థ నాయకుడని విమర్శించిన ఆయన, అహంకారం పతనానికి దారితీస్తుందని హెచ్చరించారు. ప్రతిపక్ష నేత నివాసానికి వచ్చి మరీ అరెస్టు చేసి తంజావూరు తీసుకెళ్లడం దారుణమని, రాబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ఉదయనిధిని దూరంగా ఉంచడానికే ఈ కుట్రపూరిత తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తన కుమారుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు నిరూపిస్తే తక్షణమే క్షమాపణ చెబుతాడని, ఈ కేసులో కోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు. అలాగే, సీఎం విజయ్ రీల్స్ క్రియేట్ చేయడం మాని తన బాధ్యతలకు అనుగుణంగా ప్రవర్తించాలని హితవు పలికారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విమర్శకులను అణచివేస్తోందని, నిరసనకారులను, నీట్ వ్యతిరేక ర్యాలీలను కూడా అనుమతించడం లేదని మండిపడుతూ, అదుపులోకి తీసుకున్న డీఎంకే కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఉదయనిధి అరెస్టును నిరసిస్తూ డీఎంకే శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలతో తమిళనాడులో జనజీవనం స్తంభించిపోయింది. కరూరు, సేలం, మదురై, తంజావూర్ ప్రాంతాల్లో డీఎంకే కార్యకర్తలు రహదారులను దిగ్బంధించి సీఎం విజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. తేనీలో ఆందోళన చేపట్టిన సీనియర్ నేత పన్నీర్‌సెల్వంతో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుబడుతూ టీవీకే శ్రేణులు కూడా నిరసనలకు దిగడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు మంగళవారం సాయంత్రం విచారణ పూర్తయిన అనంతరం పోలీసులు ఉదయనిధిని విడుదల చేయడంతో ప్రస్తుతానికి ఈ వివాదం కాస్త సర్దుమనిగింది.
ప్రజాయుద్దనౌక (ప్రత్యేక ప్రతినిధి): దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన 'జెన్ జీ' విద్యార్థుల ఆందోళనలు, నీట్ పేపర్ లీక్ వివాదాల అనంతరం జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. కమలం పార్టీ పాలనలో ఉన్న మూడు రాష్ట్రాల పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా, రెండింటిలో తీవ్ర పరాభవం ఎదురైంది. ఒక చోట మాత్రమే విజయం సాధించి బీజేపీ ఓ మోస్తరు ఊరట పొందింది. బీహార్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం నమోదైంది. గత 30 ఏళ్లుగా బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న బంకిపూర్ నియోజకవర్గంలో జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం దిశగా దూసుకెళ్లారు. 26 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రశాంత్ కిషోర్‌కు 53,566 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌కు 37,702 ఓట్లు పోలయ్యాయి. దీంతో ప్రశాంత్ కిషోర్ 15,864 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతూ గెలుపును ఖాయం చేసుకున్నారు. ఈ రేసులో ఆర్‌జేడీ అభ్యర్థి రేఖా కుమారి 11,933 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని దాతియా నియోజకవర్గంలోనూ బీజేపీకి పరాభవం ఎదురైంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ తన హవా చాటారు. 11 రౌండ్ల లెక్కింపు ముగిసే సమయానికి ఘనశ్యామ్ సింగ్ 54,169 ఓట్లు సాధించి, బీజేపీకి చెందిన అశుతోష్ తివారీ (41,948 ఓట్లు) పై 12,221 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే, సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో మాత్రం బీజేపీ తన పట్టును నిలబెట్టుకుంది. మంజల్ పూర్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి సతీష్ పటేల్ 55,481 ఓట్లు సాధించి, కాంగ్రెస్ అభ్యర్థి భిఖాభాయ్ రబరీ (24,851 ఓట్లు) పై 30,630 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొత్తానికి ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా బీహార్‌లో జన్ సూరజ్ పార్టీ రూపంలో కొత్త సమీకరణాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి.
(తెలంగాణ): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): కాంగ్రెస్ పార్టీలోని అగ్రకుల నేతలను లక్ష్యంగా చేసుకుని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీలో దళిత శాసనసభ్యులు తీవ్ర అణిచివేతకు గురవుతున్నారని, ఇకపై ఈ ధోరణిని సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.ఒక్క మందుల సామేల్‌కే కాకుండా తమ కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు అందరికీ ఇదే తరహా అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. నేతల అణిచివేత కారణంగా తమ నియోజకవర్గాలు కూడా అభివృద్ధికి దూరమవుతూ అణచివేతకు గురవుతున్నాయని, ఈ వివక్షపై ఇకపై మౌనంగా ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ విషయమై ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని, సమస్యలన్నింటినీ ఆయన దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. అలాగే ఎస్సీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, బిల్లుల విడుదల ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, తమ నియోజకవర్గాలకు అదనంగా వెయ్యి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ఉప ముఖ్యమంత్రిని కోరినట్లు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): నీట్ (NEET) పేపర్ లీకేజీకి నిరసనగా శనివారం సాయంత్రం నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, పేపర్ లీక్ పై నిరసన తెలిపి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించిన విద్యార్థుల విజయాన్ని అభినందించారు.ప్రధాని మోదీ జాతీయ యువత ముందు తలవంచి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారని సీఎం పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విద్యార్థుల ఉద్యమమే కారణమని, యువత తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదని నేడు నిరూపించారని ప్రశంసించారు. అయితే ఈ విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో ఎట్టిపరిస్థితుల్లోనూ వేసుకోబోమని, ప్రభుత్వం విఫలమైన ప్రతి అంశంపైనా తాము పోరాడుతామని సీఎం స్పష్టం చేశారు. ఇదే క్రమంలో కేంద్రంతో సీజేపీ జరిపిన చర్చల్లో ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని సీఎం వెల్లడించారు. విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, వారిపై కేసులు నమోదు కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న రాజకీయాలు, చట్టాలు యువతకు అడ్డుపడలేవన్న రేవంత్ రెడ్డి, ప్రపంచంలోని అనేక దేశాల్లో 18 సంవత్సరాలకే చట్టసభలకు వెళ్లే అవకాశం ఉందని గుర్తుచేశారు. 21 సంవత్సరాలకే సింగపూర్‌లో ప్రధాని కావచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు తొలివారంలో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. దేశంలో ఎమ్మెల్సీ, ఎంపీ పోటీ చేసేందుకు 21 సంవత్సరాలు ప్రధాన అర్హతగా తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని ప్రధానమంత్రి మోదీకి పంపనున్నట్లు సీఎం వెల్లడించారు. జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడమే కాకుండా.. లోక్‌సభ, రాజ్యసభలలో యువత తమ గళాన్ని వినిపించేలా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.