తమిళనాడులో రాజకీయ మంటలు: ఉదయనిధి అరెస్ట్, విడుదల.. సీఎం విజయ్‌పై ఎం.కే. స్టాలిన్ తీవ్ర ఆగ్రహం
ప్రజాయుద్ధనౌక (ప్రత్యేక ప్రతినిధి): సినీనటి త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఎం.ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాత విచారణ పూర్తి చేసి బెయిల్‌పై విడుదల చేయడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
కావేరీ జల వివాదంపై తంజావూరులో ఉదయనిధి నాయకత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఈ వివాదం మొదలైంది. కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు రిజర్వాయర్ ప్రాజెక్టును అడ్డుకోవాలని, రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, డెల్టా జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డీఎంకే ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. అయితే, ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో జనసమూహం నుంచి కొందరు నటి త్రిష పేరును ప్రస్తావించగా, ఆయన ద్వంద్వార్థం వచ్చేలా మాట్లాడారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఉదయనిధి తీవ్రంగా ఖండించారు. తన ప్రసంగాన్ని కొందరు ఎడిట్ చేసి వక్రీకరించారని, ఈ అంశంపై చట్టపరంగా పోరాడతానని స్పష్టం చేశారు.
ఉదయనిధి అరెస్టుపై ఆయన తండ్రి, డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ సీఎం విజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయ్ ఒక అసమర్థ నాయకుడని విమర్శించిన ఆయన, అహంకారం పతనానికి దారితీస్తుందని హెచ్చరించారు. ప్రతిపక్ష నేత నివాసానికి వచ్చి మరీ అరెస్టు చేసి తంజావూరు తీసుకెళ్లడం దారుణమని, రాబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ఉదయనిధిని దూరంగా ఉంచడానికే ఈ కుట్రపూరిత తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తన కుమారుడు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు నిరూపిస్తే తక్షణమే క్షమాపణ చెబుతాడని, ఈ కేసులో కోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు. అలాగే, సీఎం విజయ్ రీల్స్ క్రియేట్ చేయడం మాని తన బాధ్యతలకు అనుగుణంగా ప్రవర్తించాలని హితవు పలికారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విమర్శకులను అణచివేస్తోందని, నిరసనకారులను, నీట్ వ్యతిరేక ర్యాలీలను కూడా అనుమతించడం లేదని మండిపడుతూ, అదుపులోకి తీసుకున్న డీఎంకే కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఉదయనిధి అరెస్టును నిరసిస్తూ డీఎంకే శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలతో తమిళనాడులో జనజీవనం స్తంభించిపోయింది. కరూరు, సేలం, మదురై, తంజావూర్ ప్రాంతాల్లో డీఎంకే కార్యకర్తలు రహదారులను దిగ్బంధించి సీఎం విజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. తేనీలో ఆందోళన చేపట్టిన సీనియర్ నేత పన్నీర్‌సెల్వంతో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుబడుతూ టీవీకే శ్రేణులు కూడా నిరసనలకు దిగడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు మంగళవారం సాయంత్రం విచారణ పూర్తయిన అనంతరం పోలీసులు ఉదయనిధిని విడుదల చేయడంతో ప్రస్తుతానికి ఈ వివాదం కాస్త సర్దుమనిగింది.