పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ‘టిమ్స్’ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
★ ప్రజా ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య రంగానికి రికార్డు స్థాయిలో ఖర్చు
★ ఏడాదిన్నరలో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి
★ అవయవ మార్పిడి చికిత్సల కోసం అత్యాధునిక వసతులతో టిమ్స్ నిర్మాణం.
★ ఎయిమ్స్‌తో పోటీపడేలా ప్రభుత్వ దవాఖానాల నిర్వహణ-వైద్యులకు ప్రత్యేక ఇన్సెంటివ్‌లు.
★ సనత్‌నగర్ ‘టిమ్స్’ ఆసుపత్రి ప్రారంభోత్సవ సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): రాష్ట్రంలోని పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సనత్‌నగర్‌లో అత్యాధునిక వసతులతో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (MCR TIMS) ఆసుపత్రిని ఆయన సోమవారం ఘనంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ప్రారంభోత్సవం అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ముఖ్యమంత్రి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. కార్డియో, రీనల్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సైన్సెస్ విభాగాల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్‌ఆపరేటివ్ వార్డులు, ట్రామా విభాగం, ఐసీయూలతో పాటు రిసెప్షన్‌లో టోకెన్ డిస్పెన్సర్, ఓపీ కౌంటర్ల పనితీరును సీఎం స్వయంగా తనిఖీ చేశారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో మాట్లాడి సేవల వివరాలను అడిగి తెలుసుకుంటూ, నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా రోగులకు ఉత్తమ సేవలందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే 18 నెలల కాలంలో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, అల్వాల్ టిమ్స్, ఎల్‌బీనగర్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను ప్రతి ఆరు నెలలకు ఒకటి చొప్పున పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. వీటి ద్వారా రాష్ట్రంలో పేదలకు దాదాపు 10 వేల పడకల కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేకంగా ఒక్కో డైరెక్టర్‌ను నియమించి, నిమ్స్ తరహాలో స్వతంత్రంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రోగులకు ఉచిత భోజనం, వారి సహాయకులకు డార్మెటరీ వసతులు కల్పించడంతో పాటు సూపర్ పీజీ, నర్సింగ్ కాలేజీలను మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యారోగ్య రంగానికి రూ. 21,800 కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కింద రూ. 2,700 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 2,526 కోట్లు కలిపి మొత్తం రూ. 5,226 కోట్లను వెచ్చించినట్లు వివరించారు. ఇప్పటికే వైద్య శాఖలో 16 వేల మంది సిబ్బంది నియామకాలను పూర్తి చేసినట్లు వెల్లడించారు. వందేళ్ల క్రితం నిర్మించిన ఉస్మానియా ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో, గోషామహల్‌లోని 30 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,700 కోట్ల భారీ వ్యయంతో నూతన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనపు సమయం పనిచేస్తూ సర్జరీలు నిర్వహించే నిపుణులైన వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్‌లు) అందించే అంశాన్ని తీవ్రంగా పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.