రాష్ట్రంలో ధీటైన రాజకీయ శక్తిగా బీఎస్పీని తీర్చిదిద్దాలి: రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ పిలుపు
★ పరీక్షలకు ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో.. ఎన్నికలకు పార్టీ కమిటీలు అంతే ముఖ్యం
★ గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలి
★ సమాన ఓటు హక్కు కల్పించిన ఘనత బాబాసాహెబ్ అంబేడ్కర్‌దే
★ మెదక్ పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (మెదక్, ఆగస్టు 21): సరైన సన్నద్ధత (ప్రిపరేషన్) లేకుండా పరీక్షలు రాస్తే విద్యార్థులు ఎలాగైతే ఫెయిల్ అవుతారో, బూత్ మరియు సెక్టార్ కమిటీలను పూర్తి చేయకుండా పార్టీని ముందుకు నడపలేమని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ స్పష్టం చేశారు. రామచంద్రాపురంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో మెదక్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ ప్రేమ్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మెదక్ పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీని తిరుగులేని రాజకీయ శక్తిగా నిలబెట్టేందుకు క్షేత్రస్థాయి నుంచి కమిటీల నిర్మాణం వేగవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు ఇబ్రాం శేఖర్ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పార్టీని పటిష్టం చేసేందుకు నాయకులందరూ సమన్వయంతో కలిసికట్టుగా శ్రమించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు ఎలాంటి ఆస్తి, విద్య లేదా పన్ను చెల్లింపు నిబంధనలతో సంబంధం లేకుండా సమానమైన ఓటు హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్‌కే దక్కుతుందని గుర్తుచేశారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న బీఎస్పీకి మద్దతుగా ప్రజలను చైతన్యవంతం చేయాలని, ఇతర సాంప్రదాయ రాజకీయ పార్టీల విధానాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. ఈ సమావేశంలో విశిష్ట అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చీఫ్ జోన్-3 ఇన్‌ఛార్జ్ బోడపట్ల ఈశ్వర్, జోన్ ఇన్‌ఛార్జ్ లింగంపల్లి యాదగిరి పాల్గొన్నారు. వీరితో పాటు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ మోహన్ బాబు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సతీష్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఉమేష్, మెదక్ జిల్లా అధ్యక్షుడు శంకర్ మరియు వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.