Copyrights Reserved © 2026
prajayuddanouka.com
★ ముదురుతున్న లా వర్సిటీల వివాదం★ నల్సార్ సెగలు బెంగళూరుకు..★ రంగంలోకి NLSIU విద్యార్థులు★ వ్యవస్థల తీరుపై నిరసన స్వరం★ క్షమాపణలు చెప్పినా తగ్గని వేడిప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్లోని నల్సార్ (NALSAR) విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవ ఆహ్వానాలపై చెలరేగిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. బీసీఐ నిర్ణయం ఉపసంహరణతో వివాదం ముగిసిందని భావిస్తున్న తరుణంలో, ఆ సెగలు ఇప్పుడు దేశంలోనే అత్యున్నత న్యాయ విద్యా సంస్థ అయిన బెంగళూరు నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU)కి పాకాయి. నల్సార్ విద్యార్థులకు బాహాటంగా మద్దతు ప్రకటిస్తూ ఎన్ఎల్ఎస్ఐయూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు రంగంలోకి దిగడంతో వ్యవహారం మరింత ముదిరింది. త్వరలో జరగనున్న తమ స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాలను ముఖ్య అతిథులుగా పిలవద్దంటూ యాజమాన్యానికి ఘాటైన లేఖ రాశారు. అధికార పీఠాల్లో ఉన్నవారితో విభేదించే హక్కు విద్యార్థులకు ఉండాలని, భవిష్యత్ కెరీర్ను అడ్డుపెట్టుకుని బెదిరించే సంస్కృతిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అధికారానికి ఎదురునిలిచి మాట్లాడిన నల్సార్ విద్యార్థుల తెగువ స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడుతున్నారు. నల్సార్ విద్యార్థులపై గతంలో తీసుకున్న 'ఎన్రోల్మెంట్ నిషేధం' నిర్ణయాన్ని బీసీఐ వెనక్కి తీసుకుని, చైర్మన్ క్షమాపణలు చెప్పినప్పటికీ విద్యార్థి లోకం శాంతించలేదు. అధికారంలో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించనప్పుడు వారిని వేడుకలకు ఆహ్వానించడం నైతికంగా సరైంది కాదన్న వాదనను ఎన్ఎల్ఎస్ఐయూ తెరపైకి తెచ్చింది. ఒకదాని వెంట ఒకటిగా దేశంలోని అగ్రశ్రేణి న్యాయ విశ్వవిద్యాలయాలు ఈ అంశంపై గళమెత్తుతుండటంతో న్యాయ వ్యవస్థ, బార్ కౌన్సిల్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ లేఖపై ఎన్ఎల్ఎస్ఐయూ పాలకమండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): రాష్ట్రంలోని బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల భర్తీకి సంబంధించి మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ పూర్తిచేసి, ఆదివారం కేటాయింపులను పూర్తి చేశారు. మొత్తం 1,743 సీట్లు అందుబాటులో ఉండగా, కేవలం 1,400 మందే వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. వీరి నుంచి 1,106 మంది విద్యార్థులకు స్థానాలు దక్కాయి. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల నుంచి ఆశించిన స్థాయిలో ఆసక్తి లేకపోవడంతోనే తొలి దశ పూర్తయినా ఇంకా 637 సీట్లు మిగిలిపోయాయని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో ఈ నెల 6వ తేదీ నాటికి నేరుగా హాజరై రిపోర్ట్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు: "బొద్దింకలతో పెట్టుకోవద్దు"ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యుత్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడాన్ని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసన వేదికగా ఆయన మాట్లాడుతూ "బొద్దింకల సత్తా ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసొచ్చింది, బొద్దింకలతో పెట్టుకోవద్దు" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అభిజీత్ దీప్కే మాట్లాడుతూ ఈ రాజీనామా నీట్ పేపర్ లీక్ బాధితులకు దక్కిన న్యాయం. తమను తాము బాద్షాలుగా భావించే పాలకులను దారిలోకి తెచ్చేందుకు యువత ఐక్యతే కారణం. పాలకులను అదుపులో ఉంచాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తమ ప్రధాన డిమాండ్లలో ఒకటైన మంత్రి రాజీనామా నెరవేరినప్పటికీ, మిగిలిన రెండు డిమాండ్లు సాధించే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు పరిహారం, ఇతర డిమాండ్ల సాధనకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. మరికొద్ది సేపట్లో సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న వేళ, ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన రాజీనామాను ప్రకటించడం గమనార్హం. న్యాయమైన విద్యార్థి పోరాటానికి ఈ రాజీనామా ఒక ఉదాహరణగా నిలిచిందని సీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రజాయుద్ధనౌక/ ప్రత్యేక ప్రతినిధి: వికారాబాద్ జిల్లా హకీంపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఇకపై ఈ ప్రాజెక్టు పురోగతిని ప్రతి నెలా స్వయంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తానని స్పష్టం చేశారు.