తెలుగు నేల మరవని యుగపురుషుడు డాక్టర్ వైఎస్సార్
రాజకీయాల్లో నాయకులు వస్తుంటారు, పోతుంటారు కానీ కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తారు. వైఎస్సార్ ఆ కోవకు చెందిన అరుదైన జననేత. ఆయన ప్రజలను సంబోధించే తీరు, ముఖంపై నిత్యం చెరగని చిరునవ్వు, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే తీరు ఆయనను సామాన్య ప్రజలకు మరింత దగ్గర చేశాయి. అందుకే ఆయనను ప్రజలు కేవలం ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, తమ ఇంట్లోని పెద్ద దిక్కుగా భావించి 'రాజన్న' అని పిలుచుకున్నారు. సమస్యను విన్నవెంటనే పరిష్కరించాలనే తపన, నిర్ణయాలు తీసుకోవడంలో చూపిన ధైర్యం ఆయన పాలనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. మహిళల ఆర్థిక స్వావలంబన సమాజ ప్రగతికి అత్యంత కీలకమని వైఎస్సార్ బలంగా విశ్వసించారు. డ్వాక్రా సంఘాల ద్వారా గ్రామీణ మహిళలను సంఘటితం చేసి, వారికి పావలా వడ్డీకే వేల కోట్ల రూపాయల రుణాలను అందించడం ఒక విప్లవాత్మక మార్పునకు దారితీసింది. మహిళలు కేవలం గృహిణులుగానే కాకుండా, చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు చేపట్టి కుటుంబ పోషణలో భాగస్వాములయ్యేలా ప్రోత్సహించారు. 'అభయహస్తం' పథకం ద్వారా అసంఘటిత రంగ కార్మికులు, పేద మహిళలకు పింఛను, బీమా రక్షణ కల్పించి వృద్ధాప్యంలో వారికి భరోసాగా నిలిచారు. ఆడపిల్లల చదువు, వివాహాల కోసం ప్రత్యేక ఆర్థిక సహాయ పథకాలను ప్రవేశపెట్టి వారి సాధికారతకు బాటలు వేశారు. గ్రామాల నుంచి నగరాల వరకు అనుసంధానతను పెంచేందుకు ఆయన చేపట్టిన రహదారి ప్రాజెక్టులు నేటికీ రాష్ట్ర ప్రగతికి చోదక శక్తులుగా ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ (ORR) నగరాభివృద్ధికి జీవనాడిగా మారింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించిన పీవీ నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే నగర ట్రాఫిక్ సమస్యను అధిగమించడంలో ఒక మైలురాయిగా నిలిచింది. గ్రామీణ రోడ్ల నెట్‌వర్క్‌ను ఆధునీకరించి ప్రతి మారుమూల గ్రామానికీ రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచారు.
సంక్షేమం – అభివృద్ధి సమన్వయానికి మార్గదర్శి
సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే వాదనను ఆయన తన పరిపాలనా దక్షతతో తిప్పికొట్టారు. ఒకవైపు పన్నుల భారం మోపకుండానే సంక్షేమ ఫలాలను పేదవాడి గడప వరకు చేర్చారు. మరోవైపు పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహమిచ్చారు. ఐటీ రంగాన్ని కేవలం నగరాలకే పరిమితం చేయకుండా విస్తరించడం, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, కొత్త సాగునీటి ఆయకట్టును సృష్టించడం ద్వారా స్థిరమైన ఆర్థికాభివృద్ధికి బాటలు వేశారు.
అమరత్వం పొందిన ఆశయాలు
వైఎస్సార్ భౌతికంగా దూరమై ఏళ్లు గడుస్తున్నా, తెలుగు నేలపై ఆయన జ్ఞాపకాలు ఏమాత్రం చెరిగిపోలేదు. కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స పొంది ప్రాణాలు దక్కించుకున్న ప్రతి రోగిలో, ఫీజుల భారం లేకుండా ఇంజనీరింగ్, మెడిసిన్ పట్టా పుచ్చుకున్న ప్రతి విద్యార్థిలో, సాగునీటితో పచ్చబడిన ప్రతి ఎకరం పొలంలో, పక్కా గృహంలో తలదాచుకుంటున్న ప్రతి నిరుపేద కళ్లలో రాజశేఖర రెడ్డి జీవించే ఉన్నారు. ప్రజల కన్నీళ్లు తుడవడమే రాజకీయం, పేదవాడికి ఇచ్చిన మాటకు కట్టుబడడమే నిజమైన నాయకత్వం అని నిరూపించిన మహనీయుడు డాక్టర్ వైఎస్సార్. ఆయన వర్ధంతి కేవలం ఒక వ్యక్తిని స్మరించుకునే రోజు మాత్రమే కాదు, ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగాల్సిన పరిపాలనా స్ఫూర్తిని పునరుద్ఘాటించే సందర్భం. సంక్షేమ రంగానికి సరికొత్త బాటలు వేసిన ఆ మహానాయకుడి ఆశయాలు, స్మృతులు చిరస్మరణీయం.
- ఆర్.ఎన్.ఆర్. అక్షర జ్వాల ✍️