బాధ్యతకు దర్పణం.. భరోసాకు నిదర్శనం..రక్షాబంధన్.!
భారతీయ జీవన విధానంలో పండుగలు కేవలం ఆచారాలు కావు అవి మానవ సంబంధాల ఉనికిని గుర్తుచేసే భావోద్వేగ వారధులు. ఆ కోవలోనే శ్రావణ పూర్ణిమ నాడు జరుపుకునే రక్షాబంధన్, రక్తసంబంధాల పరిధిని దాటి సమాజంలో ఆత్మీయతను, పరస్పర గౌరవాన్ని పెంపొందించే విశిష్ట వేడుకగా నిలుస్తోంది. మణికట్టుపై ముడిపడే పట్టుదారం కేవలం ఒక అలంకారం కాదు; అది తోబుట్టువుల మధ్య తరగని ప్రేమకు ప్రతీక, జీవితాంతం రక్షణగా నిలుస్తామనే నిశ్శబ్ద వాగ్దానం.
డిజిటల్ వేగం.. నిలిచిన అనుబంధం
డిజిటల్ మాయలో పడి భౌతిక దూరాలు పెరుగుతున్న నేటి ఆధునిక కాలంలో సంబంధాల విలువ మరింత పెరుగుతోంది. ఉద్యోగ, వ్యాపార బాధ్యతల్లో మునిగితేలే తోబుట్టువులను ఒకే వేదికపైకి తెచ్చే శక్తి ఈ పండుగకు ఉంది. మైళ్ళ దూరం ఉన్నా సాంకేతికత, కొరియర్ సేవల ద్వారా చేరుతున్న రాఖీలు మారుతున్న కాలంలోనూ చెక్కుచెదరని ఆత్మీయతను చాటుతున్నాయి. సాంకేతిక మార్పులు ఎన్ని వచ్చినా, తోడబుట్టిన వారి మధ్య ఉండే ప్రేమ బంధం శాశ్వతమని ఈ వేడుక స్పష్టం చేస్తోంది.
పురాణాల నుంచి సామాజిక చైతన్యం వరకు
పురాణ ఇతిహాసాల నుంచి భారత చరిత్ర వరకు రాఖీ ప్రాధాన్యం ఎంతో ఉన్నతమైనది. ద్రౌపది కృష్ణుడి గాయానికి తన చీర కొంగును కట్టడం, ఆ భరోసాతో కృష్ణుడు ఆమెకు అండగా నిలవడం రక్షాబంధన్ మూలతత్వాన్ని తెలియజేస్తాయి. అలాగే మొఘల్ చక్రవర్తి హుమాయూన్‌కు రాణి కర్ణావతి రాఖీ పంపి సహాయం కోరిన చారిత్రక ఘట్టం.. ఈ బంధం మతాలకు, ప్రాంతాలకు అతీతమైనదని నిరూపించింది. రాఖీ కేవలం ఒకే కుటుంబానికి సంబంధించిన విషయం కాదు, ప్రతి మహిళా స్వేచ్ఛగా, సురక్షితంగా జీవించే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందనే సామాజిక స్పృహను ఇది గుర్తుచేస్తుంది.
నేటి సమాజానికి ఇదొక అత్యవసర సందేశం
మహిళల రక్షణ, గౌరవం నిత్యం చర్చనీయాంశంగా మారుతున్న ప్రస్తుత సమాజంలో రక్షాబంధన్ ప్రాధాన్యం మరింత విస్తృతమవ్వాలి. ఈ పండుగను కేవలం ఒక రోజు సంబరానికో, బహుమతుల మార్పిడికో పరిమితం చేయకూడదు. ప్రతి పురుషుడు తన ఇంట్లోని మహిళతో పాటు, సమాజంలోని తోటి స్త్రీల భద్రతకు, గౌరవానికి కట్టుబడి ఉన్నప్పుడే ఈ పండుగకు నిజమైన అర్థం చేకూరుతుంది. స్త్రీకి రక్షణ మాత్రమే కాదు, సమాన గౌరవం, స్వేచ్ఛ ఇచ్చినప్పుడే సమాజంలో నిజమైన సోదరభావం వెల్లివిరుస్తుంది. పున్నమినాటి చంద్రుడిలా స్త్రీల పట్ల చక్కటి సంస్కారం అలవర్చుకొని ఒకరికి ఒకరు తోడునీడగా అనుబంధాలతో కలకాలం వర్ధిల్లాలని ఆశిద్దాం.!
ఆర్.ఎన్.ఆర్. అక్షర జ్వాల ✍️