ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో పూలదండకు నోచుకోక బోసిపోయిన మహాత్ముడి విగ్రహం!
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగినాయి. స్వతంత్ర భారత అమృత ఘడియల్లో బాపు అందించిన శాంతి, సత్యం, అహింసా మార్గాలను ప్రతి ఒక్కరూ స్మరించుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు మొదలుకొని పల్లెపల్లెనా జాతీయ నాయకుల సేవలను కొనియాడుతూ ప్రజలు, నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కానీ... సరిగ్గా గాంధీ జయంతి నాడే జాతిపితకు తీవ్ర అవమానం ఎదురైంది. కనీసం ఆయన విగ్రహానికి పూలదండ వేసి దండం పెట్టే నాథుడే కరువయ్యాడు! ఈ విచారకర సంఘటన ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరగలేదు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామచంద్రపురం అమీన్‌పూర్, కిష్టారెడ్డిపేట/పటేల్‌గూడ పరిధిలో చోటుచేసుకుంది. గతంలో గ్రామ పంచాయతీ కార్యాలయంగా ఉండి, ఇటీవలే ఎక్సైజ్ కార్యాలయంగా ప్రారంభమైన ఈ భవనం ఆవరణలో గాంధీ విగ్రహం కొలువై ఉంది. అయితే కార్యాలయ కార్యకలాపాలు ఇంకా పూర్తిగా ప్రారంభం కాకపోవడంతో నిత్యం ఈ కార్యాలయానికి తాళం వేసే ఉంటోంది. గాంధీ జయంతి సందర్భంగా దేశమంతట సంబరాలు హోరెత్తితే.. ఇక్కడ మాత్రం బాపు విగ్రహం పూర్తిగా బోసిపోయింది. అధికారులు ఎలాగూ ప్రభుత్వ సెలవులో ఉన్నారు.. కనీసం ఇటువైపు కన్నెత్తి చూసే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులకు, నాయకులకు కూడా లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన మహనీయుడి జయంతి రోజే.. ఓ ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో ఉన్న విగ్రహానికి పూలదండ కూడా వేయకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారులు, స్థానిక నాయకుల నిర్లక్ష్యంపై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి👉: https://youtube.com/shorts/up18IglaXOs?si=X5lUUjhCQThvmZCg