శ్రామిక చెమట చుక్కల వెలుగుల సౌధం.. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్!
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్/ పాల్వంచ): తెలంగాణ విద్యుత్ రంగానికి గుండెకాయ లాంటి చారిత్రాత్మక కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (KTPS) మరోసారి ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజాయుద్ధనౌక మీడియా సంస్థల చైర్మన్, అఖిలభారత ఎస్సీ ఎడిటర్స్ & జర్నలిస్టుల ఫోరం జాతీయ అధ్యక్షులు రొడ్డ నాగరాజు (ఆర్.ఎన్.ఆర్.) గురువారం కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా ప్లాంట్ పనితీరును, రేయింబవళ్లు శ్రమిస్తున్న కార్మికుల కష్టాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి, కార్మికులను అడిగి తెలుసుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వరకు రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో KTPS కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కొలువుదీరిన ఈ విద్యుత్ కేంద్రం మొదటి దశ నిర్మాణం అధికారికంగా 1966 జూలై 4న ప్రారంభమైంది. సింగరేణి బొగ్గు గనులకు అత్యంత సమీపంలో, కిన్నెరసాని ప్రాజెక్టు జల వనరుల చెంత ఉండటం ఈ ప్లాంట్ ప్రత్యేకత. కాలక్రమేణా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా వివిధ దశల్లో విస్తరిస్తూ వచ్చిన KTPS, నేడు అత్యాధునిక సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కూడిన 2460 మెగావాట్ల యూనిట్లతో సహా భారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తొలి నాళ్లలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం తలెత్తిన సమయంలో, KTPS తన పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేసి రాష్ట్రానికి వెలుగులు పంచింది. వ్యవసాయానికి ఉచిత నిరంతర విద్యుత్, పరిశ్రమలు మరియు గృహ అవసరాలన్నింటికీ నిరంతరం విద్యుత్‌ను అందిస్తూ పారిశ్రామిక పురోభివృద్ధిలో ప్రధాన వారధిగా నిలిచింది. ఈ సందర్భంగా KTPS సందర్శనను పురస్కరించుకుని రొడ్డ నాగరాజు మాట్లాడుతూ చెమటోడ్చి వెలుగును పంచే కార్మికుల కష్టానికి ప్రతీక కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. శ్రామిక శక్తికి, జాతి పురోగభివృద్ధికి మధ్య వారధిగా నిలిచిన ఈ విద్యుత్ వలయం ప్రతి గుండెలోనూ స్ఫూర్తిని నింపుతుంది అని యంత్రాల ఘోష మధ్య జాతి కోసం శ్రమిస్తున్న కార్మికుల చెమట చుక్కల ప్రతిరూపంగా నిలిచిన KTPS, కేవలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రమే కాక దేశ ప్రగతికి ఒక నిజమైన దేవాలయం అని ఈ సందర్భంగా ఆర్.ఎన్.ఆర్. అభివర్ణించారు.