తెలంగాణ
బ్రేకింగ్
వేల్పుల సైదులు హత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రజా సంఘాల నేతలు
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి నల్గొండ: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని తక్కళ్లపహాడ్ గ్రామానికి చెందిన వేల్పుల సైదులును హైదరాబాద్ లో దుండగులు విపరీతమైన చిత్రహింసలకు గురిచేసి దారుణంగా హత్య చేయడం పట్ల పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్కళ్లపహాడ్ గ్రామానికి బుధవారం రాత్రి చేరుకున్న దళిత సంఘాల సంఘాల జేఏసీ చైర్మన్ ఈదుల పరుశురాం మాదిగ, ఎమ్మార్పీఎస్ కళామండలి రాష్ట్ర అధ్యక్షులు మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ, ప్రజాయుద్ధనౌక మీడియా సంస్థల చైర్మన్ రొడ్డ నాగరాజు, బీసీ పీపుల్స్ ఫెడరేషన్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్, బీసీ సంఘం నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు కారింగుల నరేందర్ గౌడ్ తదితరులు సైదులు మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను ఓదార్చి, కష్టకాలంలో వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. సైదులు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు మనోధైర్యానికి కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కిరాతక ఘటనపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాగం తక్షణ చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు.