కాలం కరగలేదు, కన్నీరు ఇంకలేదు.. మృత్యువుతో పోరాడి ఓడిపోయిన వేల్పుల సైదులుకు కన్నీటి వీడ్కోలు!
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని తక్కళ్లపహాడ్ గ్రామ గడ్డపై పుట్టి పెరిగిన వేల్పుల సైదులపై దుండగులు జరిపిన ఆ విపరీతమైన దాడి గురించి తెలిసిన క్షణం నుంచి మన గుండెలు తరుక్కుపోయాయి. హాస్పిటల్ మంచంపై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆయనను చూసి ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందనీ.. సైదులు తిరిగి మన మధ్యకు వస్తాడు అనే చిన్న ఆశ, నమ్మకం మాత్రమే అందరిలోనూ బతికి ఉండే.
ఆ ఆశను నిజం చేయడానికి, నాకున్న సర్వశక్తులను ఒడ్డి ఆయనను కాపాడుకోవడానికి నేను చేయని ప్రయత్నం లేదు. సైదులకు మరింత మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశంతో, తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా LOC (Letter of Credit) మంజూరు చేయించి, ఎలాగైనా ఆయనను బతికించాలని సర్వవిధాలుగా ప్రయత్నించాను. ప్రభుత్వ యంత్రాంగాన్ని, వైద్య నిపుణులను సమన్వయం చేస్తూ ఆయన ప్రాణాలను నిలబెట్టేందుకు క్షణం క్షణం పరితపించాను.
కానీ, విధి రాత ముందు, మృత్యువుతో తలపడిన ఆ పోరాటం ముందు నా ప్రయత్నాలు ఓడిపోయాయి. ఇన్ని చేసినా, ఆయనను దక్కించుకోలేకపోయామన్న నిస్సహాయత, తీరని వేదన నా మనసును తీవ్రంగా కలచివేస్తున్నాయి.
సైదులు కేవలం ఒక వ్యక్తి కాదు, నిత్యం తోటివారికి సాయం చేయాలనే తపనతో తిరిగిన ఒక మంచి మనిషి. అలాంటి వ్యక్తిని దారుణంగా పొట్టనబెట్టుకున్న ఆ దుండగుల రాక్షస చర్య క్షమించరానిది. చట్టం తన పని తాను చేసి, దోషులకు కఠినమైన శిక్ష పడేలా చూసే బాధ్యత వివిధ వ్యవస్థలపై ఉంది.
పది రోజుల పాటు మృత్యువుతో పోరాడి, చివరికి ఓడిపోయి ప్రకృతి ఒడిలోకి పయనం అయిన సైదులు, ఆయన కుటుంబానికి, తక్కళ్లపహాడ్ గ్రామానికి, మనందరికీ సైదులు లేని లోటు పూడ్చలేనిది.
శోకతప్త హృదయాలతో.. ప్రియమైన మిత్రుడు వేల్పుల సైదులు కు అశ్రునయనాలతో ఘన నివాళులు, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
– ఆర్.ఎన్.ఆర్. అక్షర జ్వాల ✍️