నిరుద్యోగులకు బాసటగా మోత్కూరు ఎంపీడీవో బాలాజీ నాయక్
»» అక్షర సాయం.. ఉద్యోగార్థులకు వరం!
»» గ్రంథాలయం చేపట్టిన 'పుస్తకాల సేకరణ' అందరికీ ఆదర్శమన్న ఎంపీడీవో
»» మోత్కూరు శాఖా గ్రంథాలయానికి 100 విలువైన పుస్తకాలను విరాళంగా అందజేసిన ఎంపీడీవో
»» ఎంపీడీవో ఉదారతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్యగిరి
ప్రజాయద్ధనౌక ప్రతినిధి మోత్కూరు: ప్రభుత్వ ఉద్యోగాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు అండగా నిలవడం సామాజిక బాధ్యత అని మోత్కూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ధరావత్ బాలాజీ నాయక్ అన్నారు. స్థానిక మోత్కూరు శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో వినూత్నంగా చేపట్టిన 'పుస్తకాల సేకరణ' కార్యక్రమానికి ఆయన తనవంతు పూర్తి మద్దతు ప్రకటించారు. దాతల సహకారంతో గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంలో భాగంగా.. ఆయన తన సొంత ఖర్చులతో వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే 100 విలువైన స్టడీ మెటీరియల్ పుస్తకాలను కొనుగోలు చేసి గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్యగిరికి మంగళవారం స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బాలాజీ నాయక్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక ఎంతో మంది గ్రామీణ విద్యార్థులు గ్రంథాలయాలనే నమ్ముకుని చదువుకుంటున్నారని గుర్తుచేశారు. అలాంటి అభ్యర్థుల కోసం మోత్కూరు గ్రంథాలయం స్వచ్ఛందంగా పుస్తకాల సేకరణ చేపట్టడం ఎంతో అభినందనీయమని, ఈ కార్యక్రమం ఇతర ప్రాంతాలకు సైతం ఆదర్శప్రాయంగా నిలుస్తోందని కొనియాడారు. తాను అందించిన ఈ పుస్తకాలు యువత ఉద్యోగ కలలను సాకారం చేసుకోవడంలో ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన ఆకాంక్షించారు. నిరుద్యోగ యువత పట్ల ఎంతో ఉదార స్వభావాన్ని ప్రదర్శించి, అడిగిన వెంటనే విలువైన పుస్తకాలు అందించిన ఎంపీడీవో బాలాజీ నాయక్ కు గ్రంథాలయ చైర్మన్ మత్స్యగిరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఇన్‌ఛార్జ్ చిలకమర్రి బాబు చారి, స్థానిక పాఠకులు బయ్యని రాజు, శ్రీధర్, కొయ్యలకారి జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
www.prajayuddanouka.com