NLSIU విద్యార్థుల సంచలన నిర్ణయం: స్నాతకోత్సవానికి సీజేఐ, బీసీఐ చైర్మన్‌లను ఆహ్వానించవద్దని లేఖ
★ ముదురుతున్న లా వర్సిటీల వివాదం
★ నల్సార్ సెగలు బెంగళూరుకు..
★ రంగంలోకి NLSIU విద్యార్థులు
★ వ్యవస్థల తీరుపై నిరసన స్వరం
★ క్షమాపణలు చెప్పినా తగ్గని వేడి
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌లోని నల్సార్ (NALSAR) విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవ ఆహ్వానాలపై చెలరేగిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. బీసీఐ నిర్ణయం ఉపసంహరణతో వివాదం ముగిసిందని భావిస్తున్న తరుణంలో, ఆ సెగలు ఇప్పుడు దేశంలోనే అత్యున్నత న్యాయ విద్యా సంస్థ అయిన బెంగళూరు నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU)కి పాకాయి. నల్సార్ విద్యార్థులకు బాహాటంగా మద్దతు ప్రకటిస్తూ ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు రంగంలోకి దిగడంతో వ్యవహారం మరింత ముదిరింది. త్వరలో జరగనున్న తమ స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాలను ముఖ్య అతిథులుగా పిలవద్దంటూ యాజమాన్యానికి ఘాటైన లేఖ రాశారు. అధికార పీఠాల్లో ఉన్నవారితో విభేదించే హక్కు విద్యార్థులకు ఉండాలని, భవిష్యత్ కెరీర్‌ను అడ్డుపెట్టుకుని బెదిరించే సంస్కృతిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అధికారానికి ఎదురునిలిచి మాట్లాడిన నల్సార్ విద్యార్థుల తెగువ స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడుతున్నారు. నల్సార్ విద్యార్థులపై గతంలో తీసుకున్న 'ఎన్‌రోల్‌మెంట్ నిషేధం' నిర్ణయాన్ని బీసీఐ వెనక్కి తీసుకుని, చైర్మన్ క్షమాపణలు చెప్పినప్పటికీ విద్యార్థి లోకం శాంతించలేదు. అధికారంలో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించనప్పుడు వారిని వేడుకలకు ఆహ్వానించడం నైతికంగా సరైంది కాదన్న వాదనను ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ తెరపైకి తెచ్చింది. ఒకదాని వెంట ఒకటిగా దేశంలోని అగ్రశ్రేణి న్యాయ విశ్వవిద్యాలయాలు ఈ అంశంపై గళమెత్తుతుండటంతో న్యాయ వ్యవస్థ, బార్ కౌన్సిల్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ లేఖపై ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ పాలకమండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.