కాంగ్రెస్ అగ్రకుల నేతలపై ఎమ్మెల్యే కవ్వంపల్లి వివాదాస్పద వ్యాఖ్యలు: దళిత ఎమ్మెల్యేల అణిచివేతపై తీవ్ర ఆగ్రహం
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): కాంగ్రెస్ పార్టీలోని అగ్రకుల నేతలను లక్ష్యంగా చేసుకుని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీలో దళిత శాసనసభ్యులు తీవ్ర అణిచివేతకు గురవుతున్నారని, ఇకపై ఈ ధోరణిని సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఒక్క మందుల సామేల్‌కే కాకుండా తమ కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు అందరికీ ఇదే తరహా అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. నేతల అణిచివేత కారణంగా తమ నియోజకవర్గాలు కూడా అభివృద్ధికి దూరమవుతూ అణచివేతకు గురవుతున్నాయని, ఈ వివక్షపై ఇకపై మౌనంగా ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ విషయమై ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని, సమస్యలన్నింటినీ ఆయన దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. అలాగే ఎస్సీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, బిల్లుల విడుదల ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, తమ నియోజకవర్గాలకు అదనంగా వెయ్యి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ఉప ముఖ్యమంత్రిని కోరినట్లు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.