తెలంగాణ
బ్రేకింగ్
ఉద్రిక్తత చోటుచేసుకున్న లోక్‌భవన్ ముట్టడి.. ఈడ్చుకెళ్లి అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్: ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపైనా, యువతపైనా లాఠీఛార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించడాన్ని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్‌లో వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన లోక్‌భవన్ ముట్టడిపై తెలంగాణ ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి విద్యార్థి నేతలు, విద్యార్థులు ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో, వారు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అరెస్టులకు పూనుకోవడంతో తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నేతలను, విద్యార్థులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. అరెస్టు చేసిన వారిని ఆసిఫ్‌నగర్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.