సాగర తీరాన వాన దేవునికి వైదిక నీరాజనం: జల సిరుల కోసం మహావరుణ యాగం జరిపించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ నాగార్జునసాగర్): ర్రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, జలాశయాలన్నీ జలకళతో నిండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం తలపెట్టిన ‘మహా వరుణయాగం’ నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ ప్రాంగణంలో కృష్ణా నదీ తీరాన వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. ఈ పవిత్ర యాగంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొని, రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగ క్రతువులను నిర్వహించి సంపూర్ణ పూర్ణాహుతి సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో, 11 హోమగుండాల నడుమ వరుణదేవుని అనుగ్రహాన్ని కాంక్షిస్తూ వైదిక విధానంలో హోమక్రతువులను నిర్వహించారు. ఈ దివ్య యాగంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు సైతం పాల్గొని పూజా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్ నినో ప్రభావంతో ఈసారి రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందనే సంకేతాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ ముందస్తు ఆధ్యాత్మిక సంకల్పాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం ఈ వరుణ యాగాన్ని నిర్వహించిందని వివరించారు. భారతీయ సంస్కృతిలో వర్షాల కోసం యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయమని గుర్తుచేసిన సీఎం, ఒకవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తూనే, ప్రకృతి, మానవ జీవితం, వ్యవసాయాల పరస్పర సంబంధాన్ని ప్రతిబింబించే సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతి అనుగ్రహాన్ని వేడుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వరుణదేవుడిని ప్రార్థిస్తూ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లతో పాటు అన్ని ప్రధాన ప్రాజెక్టులు సమృద్ధిగా నిండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి చెరువు, ప్రతి కుంట జలకళతో కళకళలాడాలని, భూగర్భ జలాలు పెరిగి పంటలు పుష్కలంగా పండాలని, తద్వారా రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పవిత్ర ఆధ్యాత్మిక మహోత్సవంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవ రావు, పి. సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నాయకులు, కార్యకర్తలు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.