Copyrights Reserved © 2026
prajayuddanouka.com
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో సాంప్రదాయ ‘ఎట్ హోమ్’ (తేనీటి విందు) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. అలాగే పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీతో పాటు పలువురు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేడుకకు విచ్చేసిన అతిథులను గవర్నర్ ఆత్మీయంగా పలకరించగా, ఆహ్లాదకర వాతావరణంలో ఈ కార్యక్రమం ముగిసింది.
(తెలంగాణ): >> సంగారెడ్డి సభలో స్మార్ట్ రేషన్ కార్డులు ప్రారంభం..>> విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నాం..>> వ్యవసాయాన్ని పండుగ చేశాం.. మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం>> ఇందిరమ్మ రాజ్యంలో మహిళా సాధికారతకు పెద్దపీట>> విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నాం..>> సంగారెడ్డి సభలో సంక్షేమ పథకాలపై సీఎం రేవంత్ కీలక ప్రకటనలుప్రజాయుద్ధనౌక ప్రతినిధి (సంగారెడ్డి): రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేసేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం సమగ్రంగా వివరించారు. నిరుద్యోగ యువత ఎవరి మాయమాటలు నమ్మి మోసపోవద్దని, ఖాళీలను ఎట్టిపరిస్థితుల్లోనూ భర్తీ చేసి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇటీవల మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. యువత నిరాశ చెందకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని, పరీక్షలన్నీ సక్రమంగా నిర్వహించే పూర్తి బాధ్యత తమ ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రంగానికి అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నామని తెలిపిన ముఖ్యమంత్రి, రైతులను రాజులా గౌరవించడమే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు వ్యవసాయ రంగంపై రూ. 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గత 32 నెలల్లో రూ. 90 వేల కోట్లతో పంటలను కొనుగోలు చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, రూ. 21 వేల కోట్లతో 25 లక్షల మంది రైతులను రుణవిముక్తులను చేశామని గుర్తుచేశారు. రైతు భరోసా కింద రూ. 36 వేల కోట్లు విడుదల చేశామని, దేశంలోనే అతి తక్కువ అప్పులున్నది తెలంగాణ రైతాంగానికేనని కేంద్ర ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీకే రూ. 60 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ అందించామని, ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం కోసం రూ. 11 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు. బడిపిల్లలకు యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగించామని, రెండు విడతల్లో మొత్తం 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుమీదే కేటాయించామని వివరించారు. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా 3.42 కోట్ల మందికి నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల బహిరంగ మార్కెట్లోనూ బియ్యం ధర కిలోకు రూ. 10 నుంచి రూ. 15 వరకు తగ్గిందని సీఎం తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు చేనేత, గీత కార్మికులు, సికిల్ సెల్ అనీమియా బాధితులందరికీ పెన్షన్లు అందిస్తామని, అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత పాలకులు చేసిన అప్పులకు ప్రతి ఏటా రూ. 75 వేల కోట్లు చెల్లిస్తూనే రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నామని, ప్రజల ఆశీర్వాదంతో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
»» నూతన పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు»» జాతీయ పతాకావిష్కరణ.. సంక్షేమ పథకాల ప్రగతి వివరణ»» స్వాతంత్ర్య సమరయోధులకు ఘన సన్మానంప్రజాయుద్ధనౌక ప్రతినిధి (సూర్యాపేట ఆగస్టు 15): సూర్యాపేట జిల్లాను రాజకీయాలకు అతీతంగా సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని నూతన పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం ఘనంగా నిర్వహించిన 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే. నరసింహలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాలాపనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం జిల్లాలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిని సమగ్రంగా వివరించారు. జిల్లాలో ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని మంత్రి తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు సుమారు 5 కోట్ల 68 లక్షల ప్రయాణాలు జరిగాయని, దీని ద్వారా మహిళలకు రూ.343 కోట్ల 87 లక్షల మేర ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 5.52 లక్షలకు పైగా సిలిండర్లు పంపిణీ చేసి రూ.15.26 కోట్ల సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని, గృహజ్యోతి పథకం ద్వారా 1.91 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ రూ.42.49 కోట్ల సబ్సిడీ సమకూర్చామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జిల్లాకు 12,868 గృహాలు కేటాయించగా 7,928 మంజూరయ్యాయని, లబ్ధిదారులకు రూ.167 కోట్లు అందించామని చెప్పారు. హుజూర్‌నగర్‌లో పెండింగ్‌లో ఉన్న 2,160 గృహాల ప్రాజెక్టు మౌలిక వసతుల కోసం అదనంగా రూ.20 కోట్లు కేటాయించామని తెలిపారు. ఆహార భద్రతలో భాగంగా జిల్లాలోని 3.72 లక్షల కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, పారదర్శక సేవల కోసం 3.71 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ యాసంగిలో రూ.901 కోట్లతో ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు, సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ కింద రూ.118.41 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ప్రస్తుత వానాకాలం రైతు భరోసా కింద జిల్లాలోని 2.90 లక్షల మంది రైతులకు రూ.364 కోట్లకు పైగా అందించామని తెలిపారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.1,649 కోట్లతో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, రూ.292.08 కోట్లతో జానపాడు, రూ.451.42 కోట్లతో రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి వివరించారు. ఎన్ఎస్పీ ఎడమ కాలువ ఆధునీకరణకు రూ.396.05 కోట్లు, మూసీ కాలువలకు రూ.75.35 కోట్లు కేటాయించామని చెప్పారు. విద్యా రంగంలో హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తిల్లో రూ.600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, హుజూర్‌నగర్‌లో రూ.126 కోట్లతో వ్యవసాయ కళాశాల, కోదాడలో రూ.53.15 కోట్లతో జవహర్ నవోదయ విద్యాలయం మంజూరైనట్లు వెల్లడించారు. మహిళా సాధికారత కోసం 23 మండల సమాఖ్యలకు రూ.8.28 కోట్లతో 23 బస్సులను అందించామని, పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పనులను మహిళా సంఘాలకే అప్పగించామని తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు గుడిపాటి అంజయ్య, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, కుక్కడం జానకి రామయ్య, బండ పుల్లారెడ్డిలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ ఘనంగా సన్మానించారు. అనంతరం పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఆర్వో ప్రేమ్‌రాజ్, జడ్పీ సీఈవో శిరీష, డీఆర్‌డీవో సన్యాసయ్య, ఆర్డీవో వేణుమాధవ్, డీఈవో అశోక్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
»» అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సందేశంప్రజాయుద్ధనౌక ప్రతినిధి హైదరాబాద్ (గోల్కొండ, ఆగస్టు 15): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటపై శనివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తొలిసారిగా కోట ప్రాంగణంలో ‘వందేమాతరం’ గీతాలాపన నిర్వహించగా, పరిసరాలన్నీ దేశభక్తి నినాదాలతో మార్మోగాయి. జెండా ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామని, సాగునీటి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. గడిచిన కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని, దేశ సగటు కంటే రాష్ట్ర తలసరి ఆదాయం మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, గృహ అవసరాలకు ఉచిత విద్యుత్, రైతు భరోసా వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధికి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ కీలకంగా మారనుందని, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ వేడుకలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక శోభను చేకూర్చాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు పలువురు ఉన్నతాధికారులు, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్ (రవీంద్రభారతి): తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పదునైన గళంతో, గజ్జె కట్టిన పాదాలతో పల్లెపల్లెనా ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు డాక్టర్ ఏపూరి సోమన్న సాంస్కృతిక, సామాజిక పోరాటాల సమాహారంగా వెలువడిన ‘25 ఏండ్ల పాటల ప్రవాహం’ పుస్తకావిష్కరణ సభ గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రాంగణంలో అత్యంత వైభవంగా, భావోద్వేగభరిత వాతావరణంలో జరిగింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి, ప్రస్తుత రాష్ట్ర రాజకీయ, సామాజిక పరిస్థితులపై విరుచుకుపడ్డారు.కన్నీటి పర్యంతమైన ప్రజా గాయకుడు.. అక్కున చేర్చుకున్న ఎమ్మెల్యేపుస్తకావిష్కరణ అనంతరం రచయిత, ప్రజా గాయకుడు డాక్టర్ ఏపూరి సోమన్న ప్రసంగిస్తూ.. పాతికేళ్లుగా ప్రజల కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం గొంతెత్తి పాడాననీ, ధూం ధాం వేదికల నుంచి సకల జనుల సమ్మె దాకా నా గళాన్ని ప్రజల కోసం అంకితం చేశానన్నారు. కానీ రాజకీయ పార్టీలు నా పాటలను, నా కలాన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పావులుగా వాడుకున్నాయనీ తీరా సమయం వచ్చాక నన్ను నట్టేట ముంచి అనగదొక్కారని, కళాకారులకు దక్కాల్సిన గుర్తింపు, రాజకీయ ప్రాతినిధ్యం ఎండమావిగానే మిగిలిపోయిందని తీవ్ర భావోద్వేగానికి గురై వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. సోమన్న ఆవేదనను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే వేదికపై లేచివెళ్లి, ఆయన కన్నీళ్లను తుడిచి ఆత్మీయంగా హత్తుకున్నారు. "కళాకారులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. ఇచ్చిన మాట ప్రాణం పోయినా తప్పే వ్యక్తిని కాననీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఏపూరి సోమన్న అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు అని సోమన్నను చట్టసభలకు పంపించే పూర్తి బాధ్యతను నేను భుజాన వేసుకుంటున్నాను అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమన్నకు, ప్రజలకు పూర్తి బరోసా కల్పించారు. వెంటనే సభకు హాజరైన ప్రజలు, ప్రముఖులు లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేయడంతో సభ దద్దరిల్లింది.సాంస్కృతిక వేడుక – గుస్సాడి నృత్యంకార్యక్రమ ప్రారంభంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కోయగోండు ఆదివాసీ కళాకారులు ప్రదర్శించిన సాంప్రదాయ ‘గుస్సాడి’ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదివాసీల డప్పు వాయిద్యాలు, నెమలి పింఛాల తలపాగాలతో సాగిన విన్యాసాలు రవీంద్రభారతికి విచ్చేసిన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.ఉద్యమకారులకు న్యాయం దక్కలే.. మళ్లీ ఆంధ్రా కాంట్రాక్టర్ల పెత్తనం రాజ్యమేలుతోంది: కోమటిరెడ్డి ధ్వజంమునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ప్రసంగంలో రాష్ట్రంలోని ప్రస్తుత పాలన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన, ఆత్మగౌరవ నినాదంతో సాధించుకున్న తెలంగాణలో నేటి పాలకులు ఆశయాలను తుంగలో తొక్కారనీ, తెలంగాణలో మళ్లీ ఆంధ్రా కాంట్రాక్టర్ల పెత్తనం రాజ్యమేలుతోందని, అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తన సహాయంతో రాజకీయంగా ఎదిగి ఎమ్మెల్యేలుగా గెలిచిన కొందరు నాయకులు, నేడు తనకే వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధపడటం దారుణమని మండిపడ్డారు. తన చేయి ఎప్పుడూ నలుగురికీ ఇచ్చేదే తప్ప, మోసం చేసే చేయి కాదని స్పష్టం చేశారు. ఏపూరి సోమన్న పాట, పోరాట పటిమను చూస్తుంటే ప్రజాయుద్ధనౌక దివంగత గద్దర్ అన్న గుర్తుకొస్తున్నారని, ఉద్యమకారుల త్యాగాలను ఎవరూ విస్మరించలేరని కొనియాడారు. మాజీ మంత్రి పుష్పలీల మాట్లాడుతూ "సోమన్న.. కంటనీరు పెట్టొద్దు, కన్నెర్ర చేయాలి! కళాకారుల వాటా, బహుజనుల హక్కుల కోసం పిడికిలెత్తి కొట్లాడాలి. ఆ పోరాట స్ఫూర్తితోనే చట్టసభల సీట్లు సాధించుకోవాలి. ఆ కోటాలో నీవు ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టాలి. తెలంగాణ ఆడబిడ్డగా నా సంపూర్ణ ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి." అని సోమన్నను ఆశీర్వదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార అవార్డు గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను, పాలకుల తప్పులను సూటిగా నిలదీసే ధైర్యం సోమన్న సొంతం. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పదునైన శబ్దాలు, లక్షలాది మంది ప్రజలను ఆలోచింపజేసే సామాజిక చైతన్యం ఒక్క ఏపూరి సోమన్న పాటలకే ఉన్నాయి. 25 ఏళ్ల ఆయన ప్రస్థానం ఒక ఉద్యమ చరిత్ర అని కొనియాడారు.సోమన్న పాటలతో దద్దరిల్లిన రవీంద్రభారతి సభ మధ్యలో "ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ... మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు ఎటు పాయె?" అంటూ సాగిన సోమన్న విప్లవ, ఉద్యమ గీతాలు సభికుల్లో తీవ్ర ఉద్వేగాన్ని రేకెత్తించాయి. తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో తెలంగాణ ధూంధాం వేదికల ద్వారా, సకల జనుల సమ్మె ద్వారా ప్రజల్లోకి చొచ్చుకెళ్లిన వైనాన్ని వక్తలు కొనియాడారు. అనంతరం తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సోమన్న విజయవంతంగా చేపట్టిన ‘జ్ఞాన చైతన్య యాత్ర’ ప్రజల ఆలోచనా విధానంలో తీసుకొచ్చిన గుణాత్మక మార్పులను ప్రముఖులు సభలో ప్రత్యేకంగా గుర్తుచేశారు. రాచకొండ రమేష్ ఏపూరి సోమన్నపైన రచించి పాడిన కవిత్వం సబీకులను ఆలోచింపచేసి ఆకట్టుకున్నది. వరంగల్ రవి పాడిన ‘అమ్మ’ పాట అమ్మ గొప్పతనాన్ని, ఆమె చూపించే నిస్వార్థమైన ప్రేమను, పడే కష్టాలను ప్రతిబింబిస్తూ ఆయన తనదైన శైలిలో గానం చేయడంతో ప్రాంగణమంతా నిశ్శబ్దం ఆవరించింది. రవి గళం నుంచి వెలువడిన భావగర్భితమైన పదాలు ప్రజలను ఆలోచింపచేశాయి.ప్రజాస్వామిక చర్చా వేదికగా సభఈ పుస్తకావిష్కరణ సభ కేవలం ఒక సాహిత్య లేదా సాంస్కృతిక కార్యక్రమంగా మాత్రమే పరిమితం కాకుండా, తెలంగాణ వర్తమాన సామాజిక, రాజకీయ పరిణామాలపై గళమెత్తే ఒక ప్రజాస్వామిక వేదికగా రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులు, బహుజన మేధావులు, కళాకారులు, కవులు, రచయితలు, విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
★ ఐదు దశాబ్దాలుగా మానవీయ విలువలను పంచుతున్న విశిష్ట కావ్యం★ సమాజ చైతన్యానికి వెలుగుదివ్వెగా నిలిచిన అనంతా చారి శతక కృతిప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: తెలుగు సాహిత్య ప్రాంగణంలో శతక ప్రక్రియకు విశిష్టమైన, శాశ్వతమైన స్థానం ఉంది. నైతిక విలువలు, సామాజిక చైతన్యం, మానవీయ దృక్పథాన్ని సరళమైన పద్య రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లిన విశిష్ట కృతి "ప్రబోధ గీతాలు"ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుత యాదాద్రి భువనగిరి పరిధి మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన ప్రఖ్యాత కవి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మోత్కూరు అనంతా చారి రచించిన ఈ పద్య శతకం 1976లో వెలువడి, నేడు (2026) విజయవంతంగా 50 వసంతాలు (స్వర్ణోత్సవం) పూర్తి చేసుకోవడం తెలుగు సాహిత్య లోకానికి ఎంతో గర్వకారణం. విలువల బోధన – అక్షర సాధనఉపాధ్యాయునిగా తరగతి గదిలో వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన మోత్కూరు అనంతా చారి, కవిగా సమాజ శ్రేయస్సు కోసం ఈ శతకాన్ని అందించారు. ఉపాధ్యాయ జీవితంలో పొందిన అనుభవాలు, సామాజిక బాధ్యతను జోడించి పద్యాలుగా మలిచారు. సమాజంలో ఆయన రచనలు కర్తవ్యం, మానవత్వం, దేశభక్తి వంటి అంశాలు 50 ఏళ్ల తర్వాత కూడా నేటి తరానికి అంతే అవసరంగా నిలిచాయి. కేవలం సాహిత్య సౌందర్యానికే పరిమితం కాకుండా, ప్రతి పద్యం ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది.కాలపరీక్షను నెగ్గిన అక్షర సత్యంతెలుగు శతక సంప్రదాయంలో ఆధునిక విలువలను సమర్థవంతంగా ప్రతిబింబించిన కొద్ది గ్రంథాలలో "ప్రబోధ గీతాలు" ఒకటి. కాలగమనాన్ని అధిగమించి, ఐదు దశాబ్దాలుగా పాఠకుల హృదయాల్లో నిలవడం ఈ గ్రంథ విశిష్టతకు నిదర్శనం. 1976–2026 స్వర్ణోత్సవ వేడుక కేవలం ఒక పుస్తక వార్షికోత్సవం మాత్రమే కాదు అది తెలుగు భాషకు, పద్య సాహిత్యానికి, విలువల ఆధారిత జీవన విధానానికి లభించిన గౌరవం. ఈ అపూర్వ సందర్భంలో మోత్కూరు అనంతా చారి సాహిత్య సేవలను స్మరించుకోవడం ప్రతి తెలుగు భాషాభిమాని బాధ్యత. వారి సాహిత్య వారసత్వం భావితరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ ఉండాలని ఆకాంక్షిద్దాం!
స్నేహశీలి.. యువ నాయకుడు నా ఆత్మీయ తమ్ముడు యాదగిరికి జన్మదిన శుభాభినందనలు!ఉమ్మడి నల్గొండ, ప్రస్తుత యాదాద్రి పరిధిఅడ్డగూడూరు గడ్డపై.. డి రేపాక ఒడిలో,భగవంతు - పాపమ్మల ముద్దుల పంటగా,ఇద్దరు అన్నల అండగా పెరిగిన ఆత్మీయ రూఫమా!పుట్టిన నేల రుణం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తూ,ప్రజా సేవయే ఊపిరిగా మలచుకున్న నాయకుడా,బీఆర్ఎస్ పార్టీ యువజన సమర కిరణమా..!నువ్వు అడుగులు వేస్తే పోరాటం.. చిరునవ్వు నవ్వితే ఆప్యాయత!నీవు చేపట్టిన ప్రతి ఆశయం విజయ తీరాలను తాకాలనీ..నీ రాజకీయ, సామాజిక ప్రయాణం సువర్ణాక్షరాలతో లిఖించబడాలని ఆకాంక్షిస్తూ..నా ఆత్మీయ తమ్ముడు యాదగిరి.. ప్రయాణం నిరంతరం ప్రజాక్షేమమై సాగాలని,సకుటుంబ సమేతంగా నూరేళ్ల ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 💐✨ ఆర్.ఎన్.ఆర్. అక్షర జ్వాల ✍️ చైర్మన్, ప్రజాయుద్ధనౌక మీడియా సంస్థలు
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/ దేవరకొండ, ఆగస్టు 11): దేవరకొండ పట్టణానికి చెందిన చేరుపల్లి యల్లమ్మ మృతి చెందడం బాధాకరమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని 10వ వార్డుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే, యల్లమ్మ భౌతికకాయాన్ని దర్శించుకుని పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం శోకసంద్రంలో మునిగిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. యల్లమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు కొండంత మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లగాసు సత్యనారాయణ, గాజుల రాజేష్, పగడిమర్రి రఘురాములు, నిరంజన్, నజీర్లతో పాటు పలువురు స్థానికులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.