నైతిక విలువల 'ప్రబోధం'.. అర్ధశతాబ్దపు అక్షర ప్రయాణం!
★ ఐదు దశాబ్దాలుగా మానవీయ విలువలను పంచుతున్న విశిష్ట కావ్యం
★ సమాజ చైతన్యానికి వెలుగుదివ్వెగా నిలిచిన అనంతా చారి శతక కృతి
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: తెలుగు సాహిత్య ప్రాంగణంలో శతక ప్రక్రియకు విశిష్టమైన, శాశ్వతమైన స్థానం ఉంది. నైతిక విలువలు, సామాజిక చైతన్యం, మానవీయ దృక్పథాన్ని సరళమైన పద్య రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లిన విశిష్ట కృతి "ప్రబోధ గీతాలు"ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుత యాదాద్రి భువనగిరి పరిధి మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన ప్రఖ్యాత కవి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మోత్కూరు అనంతా చారి రచించిన ఈ పద్య శతకం 1976లో వెలువడి, నేడు (2026) విజయవంతంగా 50 వసంతాలు (స్వర్ణోత్సవం) పూర్తి చేసుకోవడం తెలుగు సాహిత్య లోకానికి ఎంతో గర్వకారణం.
విలువల బోధన – అక్షర సాధన
ఉపాధ్యాయునిగా తరగతి గదిలో వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన మోత్కూరు అనంతా చారి, కవిగా సమాజ శ్రేయస్సు కోసం ఈ శతకాన్ని అందించారు. ఉపాధ్యాయ జీవితంలో పొందిన అనుభవాలు, సామాజిక బాధ్యతను జోడించి పద్యాలుగా మలిచారు. సమాజంలో ఆయన రచనలు కర్తవ్యం, మానవత్వం, దేశభక్తి వంటి అంశాలు 50 ఏళ్ల తర్వాత కూడా నేటి తరానికి అంతే అవసరంగా నిలిచాయి. కేవలం సాహిత్య సౌందర్యానికే పరిమితం కాకుండా, ప్రతి పద్యం ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది.
కాలపరీక్షను నెగ్గిన అక్షర సత్యం
తెలుగు శతక సంప్రదాయంలో ఆధునిక విలువలను సమర్థవంతంగా ప్రతిబింబించిన కొద్ది గ్రంథాలలో "ప్రబోధ గీతాలు" ఒకటి. కాలగమనాన్ని అధిగమించి, ఐదు దశాబ్దాలుగా పాఠకుల హృదయాల్లో నిలవడం ఈ గ్రంథ విశిష్టతకు నిదర్శనం. 1976–2026 స్వర్ణోత్సవ వేడుక కేవలం ఒక పుస్తక వార్షికోత్సవం మాత్రమే కాదు అది తెలుగు భాషకు, పద్య సాహిత్యానికి, విలువల ఆధారిత జీవన విధానానికి లభించిన గౌరవం. ఈ అపూర్వ సందర్భంలో మోత్కూరు అనంతా చారి సాహిత్య సేవలను స్మరించుకోవడం ప్రతి తెలుగు భాషాభిమాని బాధ్యత. వారి సాహిత్య వారసత్వం భావితరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ ఉండాలని ఆకాంక్షిద్దాం!