(తెలంగాణ): >> సంగారెడ్డి సభలో స్మార్ట్ రేషన్ కార్డులు ప్రారంభం..
>> విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నాం..
>> వ్యవసాయాన్ని పండుగ చేశాం.. మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం
>> ఇందిరమ్మ రాజ్యంలో మహిళా సాధికారతకు పెద్దపీట
>> విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నాం..
>> సంగారెడ్డి సభలో సంక్షేమ పథకాలపై సీఎం రేవంత్ కీలక ప్రకటనలు
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (సంగారెడ్డి): రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేసేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం సమగ్రంగా వివరించారు. నిరుద్యోగ యువత ఎవరి మాయమాటలు నమ్మి మోసపోవద్దని, ఖాళీలను ఎట్టిపరిస్థితుల్లోనూ భర్తీ చేసి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇటీవల మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. యువత నిరాశ చెందకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని, పరీక్షలన్నీ సక్రమంగా నిర్వహించే పూర్తి బాధ్యత తమ ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రంగానికి అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నామని తెలిపిన ముఖ్యమంత్రి, రైతులను రాజులా గౌరవించడమే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు వ్యవసాయ రంగంపై రూ. 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గత 32 నెలల్లో రూ. 90 వేల కోట్లతో పంటలను కొనుగోలు చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, రూ. 21 వేల కోట్లతో 25 లక్షల మంది రైతులను రుణవిముక్తులను చేశామని గుర్తుచేశారు. రైతు భరోసా కింద రూ. 36 వేల కోట్లు విడుదల చేశామని, దేశంలోనే అతి తక్కువ అప్పులున్నది తెలంగాణ రైతాంగానికేనని కేంద్ర ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీకే రూ. 60 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ అందించామని, ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం కోసం రూ. 11 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు. బడిపిల్లలకు యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగించామని, రెండు విడతల్లో మొత్తం 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుమీదే కేటాయించామని వివరించారు. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా 3.42 కోట్ల మందికి నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల బహిరంగ మార్కెట్‌లోనూ బియ్యం ధర కిలోకు రూ. 10 నుంచి రూ. 15 వరకు తగ్గిందని సీఎం తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు చేనేత, గీత కార్మికులు, సికిల్ సెల్ అనీమియా బాధితులందరికీ పెన్షన్లు అందిస్తామని, అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత పాలకులు చేసిన అప్పులకు ప్రతి ఏటా రూ. 75 వేల కోట్లు చెల్లిస్తూనే రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నామని, ప్రజల ఆశీర్వాదంతో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.