గోల్కొండ కోటపై మువ్వన్నెల జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి హైదరాబాద్ (గోల్కొండ, ఆగస్టు 15): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటపై శనివారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తొలిసారిగా కోట ప్రాంగణంలో ‘వందేమాతరం’ గీతాలాపన నిర్వహించగా, పరిసరాలన్నీ దేశభక్తి నినాదాలతో మార్మోగాయి. జెండా ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామని, సాగునీటి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. గడిచిన కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని, దేశ సగటు కంటే రాష్ట్ర తలసరి ఆదాయం మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, గృహ అవసరాలకు ఉచిత విద్యుత్, రైతు భరోసా వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధికి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ కీలకంగా మారనుందని, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ వేడుకలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక శోభను చేకూర్చాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు పలువురు ఉన్నతాధికారులు, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.