ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో సాంప్రదాయ ‘ఎట్ హోమ్’ (తేనీటి విందు) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. అలాగే పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీతో పాటు పలువురు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేడుకకు విచ్చేసిన అతిథులను గవర్నర్ ఆత్మీయంగా పలకరించగా, ఆహ్లాదకర వాతావరణంలో ఈ కార్యక్రమం ముగిసింది.