రాజకీయాలకతీతంగా సూర్యాపేట సమగ్రాభివృద్ధి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
»» నూతన పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
»» జాతీయ పతాకావిష్కరణ.. సంక్షేమ పథకాల ప్రగతి వివరణ
»» స్వాతంత్ర్య సమరయోధులకు ఘన సన్మానం
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (సూర్యాపేట ఆగస్టు 15): సూర్యాపేట జిల్లాను రాజకీయాలకు అతీతంగా సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని నూతన పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం ఘనంగా నిర్వహించిన 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే. నరసింహలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాలాపనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం జిల్లాలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిని సమగ్రంగా వివరించారు. జిల్లాలో ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని మంత్రి తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు సుమారు 5 కోట్ల 68 లక్షల ప్రయాణాలు జరిగాయని, దీని ద్వారా మహిళలకు రూ.343 కోట్ల 87 లక్షల మేర ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 5.52 లక్షలకు పైగా సిలిండర్లు పంపిణీ చేసి రూ.15.26 కోట్ల సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని, గృహజ్యోతి పథకం ద్వారా 1.91 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ రూ.42.49 కోట్ల సబ్సిడీ సమకూర్చామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జిల్లాకు 12,868 గృహాలు కేటాయించగా 7,928 మంజూరయ్యాయని, లబ్ధిదారులకు రూ.167 కోట్లు అందించామని చెప్పారు. హుజూర్‌నగర్‌లో పెండింగ్‌లో ఉన్న 2,160 గృహాల ప్రాజెక్టు మౌలిక వసతుల కోసం అదనంగా రూ.20 కోట్లు కేటాయించామని తెలిపారు. ఆహార భద్రతలో భాగంగా జిల్లాలోని 3.72 లక్షల కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, పారదర్శక సేవల కోసం 3.71 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ యాసంగిలో రూ.901 కోట్లతో ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు, సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ కింద రూ.118.41 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ప్రస్తుత వానాకాలం రైతు భరోసా కింద జిల్లాలోని 2.90 లక్షల మంది రైతులకు రూ.364 కోట్లకు పైగా అందించామని తెలిపారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.1,649 కోట్లతో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, రూ.292.08 కోట్లతో జానపాడు, రూ.451.42 కోట్లతో రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి వివరించారు. ఎన్ఎస్పీ ఎడమ కాలువ ఆధునీకరణకు రూ.396.05 కోట్లు, మూసీ కాలువలకు రూ.75.35 కోట్లు కేటాయించామని చెప్పారు. విద్యా రంగంలో హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తిల్లో రూ.600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, హుజూర్‌నగర్‌లో రూ.126 కోట్లతో వ్యవసాయ కళాశాల, కోదాడలో రూ.53.15 కోట్లతో జవహర్ నవోదయ విద్యాలయం మంజూరైనట్లు వెల్లడించారు. మహిళా సాధికారత కోసం 23 మండల సమాఖ్యలకు రూ.8.28 కోట్లతో 23 బస్సులను అందించామని, పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పనులను మహిళా సంఘాలకే అప్పగించామని తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు గుడిపాటి అంజయ్య, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, కుక్కడం జానకి రామయ్య, బండ పుల్లారెడ్డిలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ ఘనంగా సన్మానించారు. అనంతరం పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఆర్వో ప్రేమ్‌రాజ్, జడ్పీ సీఈవో శిరీష, డీఆర్‌డీవో సన్యాసయ్య, ఆర్డీవో వేణుమాధవ్, డీఈవో అశోక్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.