Copyrights Reserved © 2026
prajayuddanouka.com
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ పరిణామం ఎవరికీ ఓటమి కాదని, విద్యార్థుల భవిష్యత్తు కోసం దక్కిన విజయమని ఆయన అభివర్ణించారు. విద్యారంగంలో సంస్కరణలు, పారదర్శకత మరియు బాధ్యతాయుత వైఖరి కోసం విద్యార్థులు పట్టుబట్టి ఈ విజయాన్ని సాధించారని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వంపై తమ పోరాటం మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు భారత విద్యారంగం అందరికీ గర్వకారణంగా ఉండేదని, కానీ గడిచిన కొన్ని ఏళ్లలో ప్రైవేటీకరణ పెరిగిపోయిందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ వ్యవస్థలోని లోపాలకు కేవలం ఒక చిహ్నం మాత్రమేనని, విద్యార్థులు ఏ ఒక్క మంత్రిని టార్గెట్ చేస్తూ ఆందోళన చేయలేదని ఆయన వివరించారు. వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత ధోరణి కోసమే విద్యార్థులు నిరసనకు దిగారని తెలిపారు. నిరసనల సమయంలో విద్యార్థులపై కఠినంగా వ్యవహరించిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించడంతో పాటు, విద్యార్థులకు ప్రధాని కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రాహుల్ గాంధీ, నిరసనల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు అమిత్ షానే కారణమని ఆరోపించారు.
న్యూఢిల్లీ:దేశంలో వరుసగా జరుగుతున్న పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల రద్దు మరియు నిరుద్యోగ సమస్యలపై విద్యార్థులు, యువత చేపట్టిన 'కాక్రోచ్' నిరసన ఉద్యమం (Cockroach Janta Party) దేశ రాజధాని న్యూఢిల్లీలో తీవ్ర రూపాంతరం దాల్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీపంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.పార్లమెంట్ వైపు మార్చ్ – టీర్ గ్యాస్, లాఠీఛార్జ్:జులై 20న జంతర్ మంతర్ వద్ద సేకరించిన వేలాది మంది నిరసనకారులు పార్లమెంట్ భవనం వైపు ఊరేగింపుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ముందస్తు అనుమతి లేదనే కారణంతో ఢిల్లీ పోలీసులు వారిని బారికేడ్లతో అడ్డుకున్నారు. నిరసనకారులు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు టీర్ గ్యాస్ షెళ్లను ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు, పోలీసులకు గాయాలయ్యాయి.ఉద్యమ నేపథ్యం:మే 2026లో ఆన్లైన్ వ్యంగ్య ప్రచారంగా రూపుదిద్దుకున్న ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) అనతికాలంలోనే లక్షలాది మంది యువతను ఆకర్షించింది. వైద్య విద్యా ప్రవేశ పరీక్షల (NEET) లీకేజీలు, పరీక్షల రద్దు వల్ల లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోవడమే ఈ ఆగ్రహానికి ప్రధాన కారణం. సోనమ్ వాంగ్‌చుక్ లాంటి ప్రముఖ విద్యావేత్తలు కూడా ఈ ఆందోళనలకు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టడంతో ఈ ఉద్యమానికి మరింత ప్రాధాన్యత లభించింది.ప్రభుత్వ స్పందన:నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, ప్రశ్నాపత్రాల లీకేజీ బాధ్యులపై విచారణను వేగవంతం చేసేందుకు 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులు' ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేవరకు మరియు వ్యవస్థాగతమైన సంస్కరణలు స్పష్టంగా చేపట్టే వరకు తమ పోరాటం ఆగదని CJP ప్రతినిధులు స్పష్టం చేశారు.
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: పేపర్ లీక్ అనేది అత్యంత తీవ్రమైన సమస్యని, మెరుగైన విద్యా వ్యవస్థ కోసం విద్యార్థులంతా ఒక్కటై పోరాడటం అభినందనీయమని ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అన్నారు. ఈ ఉద్యమానికి వారి తల్లిదండ్రులూ అండగా నిలవడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థుల పోరాటం వారి అంకితభావం, నిజాయితీ, కష్టపడి చదివి తమ భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును నిర్మించాలనే తపనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ శాంతియుత నిరసనలో విద్యార్థులు ప్రదర్శించిన ధైర్యం, నిబద్ధత ప్రశంసనీయమన్నారు. విద్య పట్ల ఇంతటి ఆసక్తి, లక్ష్యసాధనతో ముందుకు సాగుతున్న ఈ తరం భారతదేశానికి గర్వకారణమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో పేపర్ లీక్‌ల వ్యవహారంపై సీజేపీ చేస్తున్న ఉద్యమానికి సల్మాన్ తన మద్దతును ప్రకటించారు. శాంతియుతంగా ప్రారంభమైన ఉద్యమం హింసాత్మక మలుపు తిరగడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన విద్యార్థులు, వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు తాను విద్యార్థిగా ఉన్నప్పటి ఫొటోను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగపూరిత పోస్టు చేశారు. ఈ వివాదం విద్యార్థులు, విద్యా వ్యవస్థ మధ్య ఉన్న అంశమని, దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఉద్యమానికి సంబంధించిన పూర్తి గుర్తింపు, క్రెడిట్ విద్యార్థులకే దక్కాలని ఆయన అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకరించి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. విద్యను కోరుకునే ప్రతి విద్యార్థిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్న సల్మాన్.. భవిష్యత్తులో విద్యే కొత్త ట్రెండ్‌గా, ఫ్యాషన్‌గా మారాలని ఆకాంక్షించారు. ప్రతి ఏడాది విద్యకు మరింత ప్రాధాన్యం పెరిగి, ప్రపంచంలోని ఇతర దేశాల విద్యార్థులు చదువు కోసం భారత్‌కి వచ్చేలా దేశం అంతర్జాతీయ విద్యా కేంద్రంగా ఎదగాలన్నారు. సల్మాన్ ఖాన్ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు రత్న పాఠక్ షా, జీనత్ అమన్, నసీరుద్దీన్ షా, ఓమీ వైద్య, అభయ్ డియోల్, రితేష్ దేశ్‌ముఖ్, సోనాక్షి సిన్హా వంటి ప్రముఖులు ఇప్పటికే సీజేపీ ఉద్యమానికి బహిరంగంగా మద్దతు తెలిపారు.
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలుకుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆమె, అక్కడి నుంచే పర్యాటకుల భద్రతను ఉద్దేశించి ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. దట్టమైన అడవులు, గోదావరి జలాలు, బొగత జలపాతం, రామప్ప దేవాలయం, మేడారం వంటి చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి అందాలకు ములుగు కేరాఫ్ అడ్రస్ అని ఆమె పేర్కొన్నారు. పర్యాటకులు ఇక్కడికి వచ్చి సంతోషకరమైన జ్ఞాపకాలతో సురక్షితంగా తిరిగి వెళ్లాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. అయితే, ఇటీవల కొందరు యువకులు ఉత్సాహంతో నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోవడం పట్ల మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ, పోలీసు శాఖలు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటవద్దని ఆమె హెచ్చరించారు. ప్రమాదకరమైన జలపాతాలు, వేగంగా ప్రవహించే వాగులు, కొండచరియల వద్ద కేవలం సెల్ఫీలు, వీడియోల కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. పర్యాటకులు అధికారుల సూచనలను పాటిస్తూ, బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే పర్యటన సురక్షితంగా, ఆనందంగా ఉంటుందని సీతక్క గుర్తుచేశారు.
ప్రజాయుద్ధనౌక/ ప్రత్యేక ప్రతినిధి: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్-యుజి (NEET-UG) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టకేలకు స్పందించారు. నీట్ పేపర్ లీక్ కారణంగా 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, మూడు నెలలుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తూ ఉద్యమం ఉదృతం చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన ఎన్డీయే (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. నీట్ లీకేజీ ఘటనను అత్యంత తీవ్రమైన 'ఘోర పాపం'గా అభివర్ణించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులందరినీ ఇప్పటికే అరెస్ట్ చేశామని, భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి చర్యలకు ఒడిగట్టాలంటే భయపడేలా వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఉదంతంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, మళ్లీ పరీక్షలను సైతం నిర్వహించిందని ఆయన గుర్తుచేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అయితే, సోమవారం ఢిల్లీ వీధుల్లో విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనలపై పోలీసులు వ్యవహరించిన తీరు, వారి దాష్టీకంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆందోళనలను అణచివేయడం కాకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రజాయుద్ధనౌక/ ప్రత్యేక ప్రతినిధి: విద్యా రంగ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిజెపి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన పార్లమెంట్ మార్చ్‌లో విద్యార్థులు, యువతపై లాఠీఛార్జ్ చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. మంగళవారం ఈ అంశంపై పార్లమెంట్ స్తంభించింది. నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీఛార్జ్‌లపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు చేపట్టాయి. దీంతో సభలు వాయిదాల పర్వం కొనసాగాయి. దేశ రాజధానిలో సిజెపి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా ఆప్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. లోక్‌సభను స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించి ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి తీసుకొచ్చారు. దీంతో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభ ప్రారంభమైన తొమ్మిది నిమిషాల్లోనే మధ్యాహ్నం రెండు గంటలకు ప్యానెల్ స్పీకర్ సంధ్యా రే వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. ప్యానెల్ స్పీకర్ దిలీప్ సైకియా నియమం 377 ప్రకారం, సభ్యులు తమ తమ స్థానాలలో కూర్చొని, సభా కార్యకలాపాలను కొనసాగించాలని కోరారు. ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో సభను నాలుగు నిమిషాల్లోనే బుధవారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ అదే సీను కొనసాగింది. సభను ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రారంభించారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను వినాలని అన్నారు. "పేపర్ లీక్‌లు, నీట్ పరీక్షపై గళం విప్పుతున్న మన విద్యార్థులపై లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగించి దాడి చేశారు. వారు ఆసుపత్రుల్లో ఉన్నారు. వారి సమస్యలను వినాలి" అని ఖర్గే అన్నారు. దీంతో సభలో అధికార పార్టీ సభ్యులు లేచి కేకలు వేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను ఏడు నిమిషాల్లోనే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కొనసాగింది. దీంతో ఛైర్మన్ సభను ఒక్క నిమిషంలోనే మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్ ఒక్క నిమిషంలోనే సభను బుధవారానికి వాయిదా వేశారు.