Copyrights Reserved © 2026
prajayuddanouka.com
★ ప్రజా ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య రంగానికి రికార్డు స్థాయిలో ఖర్చు★ ఏడాదిన్నరలో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి★ అవయవ మార్పిడి చికిత్సల కోసం అత్యాధునిక వసతులతో టిమ్స్ నిర్మాణం.★ ఎయిమ్స్‌తో పోటీపడేలా ప్రభుత్వ దవాఖానాల నిర్వహణ-వైద్యులకు ప్రత్యేక ఇన్సెంటివ్‌లు.★ సనత్‌నగర్ ‘టిమ్స్’ ఆసుపత్రి ప్రారంభోత్సవ సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (హైదరాబాద్): రాష్ట్రంలోని పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సనత్‌నగర్‌లో అత్యాధునిక వసతులతో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (MCR TIMS) ఆసుపత్రిని ఆయన సోమవారం ఘనంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ప్రారంభోత్సవం అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి ముఖ్యమంత్రి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. కార్డియో, రీనల్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సైన్సెస్ విభాగాల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్‌ఆపరేటివ్ వార్డులు, ట్రామా విభాగం, ఐసీయూలతో పాటు రిసెప్షన్లో టోకెన్ డిస్పెన్సర్, ఓపీ కౌంటర్ల పనితీరును సీఎం స్వయంగా తనిఖీ చేశారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో మాట్లాడి సేవల వివరాలను అడిగి తెలుసుకుంటూ, నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా రోగులకు ఉత్తమ సేవలందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే 18 నెలల కాలంలో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, అల్వాల్ టిమ్స్, ఎల్బీనగర్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను ప్రతి ఆరు నెలలకు ఒకటి చొప్పున పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. వీటి ద్వారా రాష్ట్రంలో పేదలకు దాదాపు 10 వేల పడకల కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేకంగా ఒక్కో డైరెక్టర్‌ను నియమించి, నిమ్స్ తరహాలో స్వతంత్రంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రోగులకు ఉచిత భోజనం, వారి సహాయకులకు డార్మెటరీ వసతులు కల్పించడంతో పాటు సూపర్ పీజీ, నర్సింగ్ కాలేజీలను మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యారోగ్య రంగానికి రూ. 21,800 కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కింద రూ. 2,700 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 2,526 కోట్లు కలిపి మొత్తం రూ. 5,226 కోట్లను వెచ్చించినట్లు వివరించారు. ఇప్పటికే వైద్య శాఖలో 16 వేల మంది సిబ్బంది నియామకాలను పూర్తి చేసినట్లు వెల్లడించారు. వందేళ్ల క్రితం నిర్మించిన ఉస్మానియా ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో, గోషామహల్‌లోని 30 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,700 కోట్ల భారీ వ్యయంతో నూతన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనపు సమయం పనిచేస్తూ సర్జరీలు నిర్వహించే నిపుణులైన వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్‌లు) అందించే అంశాన్ని తీవ్రంగా పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
(ఆంధ్రప్రదేశ్): ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో గుంటూరులో 3, ఎన్టీఆర్ జిల్లాలో 2, అలాగే అల్లూరి, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు వైద్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం 24 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో 16 మంది ఇళ్ల వద్దే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనా మరియు ఇతర కారణాలతో నలుగురు మరణించినట్లు వెల్లడించింది.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ హైదరాబాద్: వైద్యులపైనే పూర్తిగా ఆధారపడకుండా, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలని తెలంగాణ 108 EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ కార్యనిర్వాహక అధికారి (CEO) B. సుధాకర్ పిలుపునిచ్చారు. 'అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం' (జులై 24) సందర్భంగా "మనల్ని మనం కాపాడుకోవడం" అనే ఇతివృత్తంతో (Theme) 108 సర్వీసెస్ వారు ప్రత్యేక మీడియా నివేదికను విడుదల చేశారు. వారంలో 7 రోజులు, రోజుకు 24 గంటల పాటు (24/7) ప్రతి ఒక్కరికీ స్వీయ సంరక్షణ ఎంతో అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.యువతలోనూ పెరుగుతున్న గుండె జబ్బులు108 సర్వీసెస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో 2026 జనవరి నుండి జూన్ వరకు ఆరు నెలల కాలంలోనే 17,940 ఛాతీ నొప్పి (గుండెపోటు) కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం 30 నుండి 40 ఏళ్ల వయస్సున్న యువతలో కూడా గుండె జబ్బులు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అలాగే గత 6 నెలల్లో 5,025 స్ట్రోక్ (పక్షవాతం) కేసులు నమోదయ్యాయని తెలిపారు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌లను క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా వీటిని నివారించవచ్చని స్పష్టం చేశారు.గుండె ఆరోగ్యానికి (HEART) ఫార్ములాప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి HEART ఫార్ములాను పాటించాలని సూచించారు: H (Healthy Diet): సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. E (Exercise): రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా వ్యాయామం. A (Avoid Tobacco/Alcohol): పొగాకు, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండటం. R (Regular BP Check): ప్రతి 3 నెలలకు ఒకసారి బీపీ, రక్త పరీక్షలు చేయించుకోవడం. T (Time for Meditation): మానసిక ప్రశాంతత కోసం రోజుకు 10 నిమిషాలు ధ్యానం చేయడం.ఎల్బీనగర్‌లో అవగాహన ప్రదర్శనస్వీయ సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వీయ సంరక్షణ ద్వారా ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పనిలో ఉత్పాదకత పెరుగుతుందని నిపుణులు వివరించారు. ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితి ఎదురైతే వెంటనే 108 నంబరుకు కాల్ చేయడం కూడా బాధ్యతాయుతమైన స్వీయ సంరక్షణలో భాగమేనని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ మేనేజర్ జాన్ సాహిద్, సూపర్వైజర్ రాజబాబు, EMT సురేష్, పైలట్ సురేష్, ఆశా వర్కర్లు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. "మన ఆరోగ్యం - మన బాధ్యత" అనే నినాదంతో నేటి నుంచే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రారంభించాలని కోరారు.
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని బీబీనగర్ లో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రి యాజమాన్యం రోగులకు వైద్య సేవలందించే అవుట్‌పేషెంట్ (ఓపీడీ) రిజిస్ట్రేషన్ సమయాల్లో కీలక మార్పులు చేపట్టింది. ఈ సవరించిన నూతన వేళలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ఎయిమ్స్ వర్గాలు స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ఎయిమ్స్ సంస్థల పనివేళల నిబంధనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రి పరిపాలనా విభాగం వెల్లడించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఓపీడీ రిజిస్ట్రేషన్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, శనివారం ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు మాత్రమే ఉంటుందని ఎయిమ్స్ యాజమాన్యం తెలిపింది. విభాగాల వారీగా కూడా ఓపీడీ సేవల రోజులను నిర్ణయించింది. బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగం సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాలు సోమ, బుధ, శుక్రవారాల్లో, యూరాలజీ విభాగం సోమ, మంగళ, గురు, శుక్ర, శనివారాల్లో, మిగతా అన్ని విభాగాలు సోమవారం నుంచి శనివారం వరకు పనిచేయనున్నాయని తెలిపింది. సవరించిన రిజిస్ట్రేషన్ సమయాలను దృష్టిలో ఉంచుకుని రోగులు ఆసుపత్రికి రావాలని బీబీనగర్ ఎయిమ్స్ అధికారులు సూచించారు. ఈ మార్పులతో ఓపీడీ సేవలు మరింత క్రమబద్ధంగా సాగడంతో పాటు రోగులకు వేగవంతమైన సేవలు అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.