వైద్యం
బ్రేకింగ్
బీబీనగర్ ఎయిమ్స్ రోగులకు ముఖ్య గమనిక.. ఓపీడీ వేళల్లో మార్పులు!
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి/ యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని బీబీనగర్ లో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రి యాజమాన్యం రోగులకు వైద్య సేవలందించే అవుట్‌పేషెంట్ (ఓపీడీ) రిజిస్ట్రేషన్ సమయాల్లో కీలక మార్పులు చేపట్టింది. ఈ సవరించిన నూతన వేళలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ఎయిమ్స్ వర్గాలు స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ఎయిమ్స్ సంస్థల పనివేళల నిబంధనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రి పరిపాలనా విభాగం వెల్లడించింది.
కొత్త షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఓపీడీ రిజిస్ట్రేషన్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, శనివారం ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు మాత్రమే ఉంటుందని ఎయిమ్స్ యాజమాన్యం తెలిపింది. విభాగాల వారీగా కూడా ఓపీడీ సేవల రోజులను నిర్ణయించింది.
బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగం సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో,
కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాలు సోమ, బుధ, శుక్రవారాల్లో,
యూరాలజీ విభాగం సోమ, మంగళ, గురు, శుక్ర, శనివారాల్లో,
మిగతా అన్ని విభాగాలు సోమవారం నుంచి శనివారం వరకు పనిచేయనున్నాయని తెలిపింది. సవరించిన రిజిస్ట్రేషన్ సమయాలను దృష్టిలో ఉంచుకుని రోగులు ఆసుపత్రికి రావాలని బీబీనగర్ ఎయిమ్స్ అధికారులు సూచించారు. ఈ మార్పులతో ఓపీడీ సేవలు మరింత క్రమబద్ధంగా సాగడంతో పాటు రోగులకు వేగవంతమైన సేవలు అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.