పార్లమెంట్‌లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు.. యువత భవిష్యత్తుతో ఆడుకుంటే ఇక కటకటాల పాలే!
ప్రజాయుద్ధనౌక ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకుంటోంది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులను నిరోధించేందుకు మరింత కఠినమైన చట్టాన్ని తీసుకొస్తోంది. ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌మెంట్ బిల్లు, 2026ను సోమవారం జూలై 27న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇవాళ ఆదివారం కావడంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు లేవు. వీకెండ్ విరామం తర్వాత సోమవారం నుంచి మళ్లీ సభలు ప్రారంభమవుతాయి. అందుకే ఈ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి వీడియో సందేశంలో “వచ్చే వారం పార్లమెంట్‌లో కఠిన చట్టం తీసుకొస్తాం” అని ప్రకటించిన తర్వాత.. శుక్రవారం కేంద్ర క్యాబినెట్ ఈ బిల్లును ఆమోదించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ బిల్లు ద్వారా.. 2024లో అమల్లోకి వచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టాన్ని సవరిస్తున్నారు. నీట్ యుజి 2026 పేపర్ లీక్ వివాదం, జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరిగిన నిరసనల మధ్య ఈ చర్య తీసుకున్నారు. ఈ సవరణ బిల్లును చట్టంగా మార్చి.. పరీక్షల వ్యవస్థలపై తిరిగి ప్రజల్లో, యువతలో నమ్మకం కలిగించాలి అని కేంద్రం ప్రయత్నిస్తోంది.
బిల్లులోని ముఖ్యమైన నిబంధనలు ఇవి:
సాధారణ నేరాలకు కనీస జైలు శిక్షను 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచారు. మాగ్జిమం శిక్షను 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచారు. జరిమానాను రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచారు.
సంఘటిత నేరాలకు అంటే.. ఆర్గనైజ్డ్ క్రైమ్‌కి.. అంటే కావాలని, ఓ పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం చేసే విద్యా నేరాలకు.. కనీస జైలు శిక్షను 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలకు పెంచారు. జరిమానాను రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లకు పెంచారు. సర్వీస్ ప్రొవైడర్లకు.. అంటే.. పరీక్షా కేంద్రాలు, ఏజెన్సీలకు జరిమానాను రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచారు. వారిని 4 సంవత్సరాలకు బదులు 8 సంవత్సరాల పాటు పబ్లిక్ ఎగ్జామ్స్ నుంచి బహిష్కరించేలా బిల్లు ఉంది. అవసరమైతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టే అధికారం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దర్యాప్తు రెండు నెలల్లోపు పూర్తి చేయాలి. స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి రోజువారీ విచారణ జరపాలి. ఛార్జ్‌షీట్ దాఖలైన తర్వాత 3 నెలల్లోపు ట్రయల్ పూర్తి చేయాలి. అప్పీళ్లు సాధ్యమైనంత వరకు 3 నెలల్లోపు పరిష్కరించాలి.
ఈ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టిన తర్వాత చర్చ, ఆమోదం కోసం ప్రయత్నిస్తారు. ప్రధాని మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును వీలైనంత త్వరగా పాస్ చేయాలని సూచించారు. విద్యా శాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి.. ఈ సవరణ బిల్లును ప్రతిపక్షాలు ఆమోదించే ఛాన్స్ ఉంది. మొత్తంగా, ఈ అమెండ్‌మెంట్ బిల్లు పరీక్షా మోసాలపై కఠిన చర్యలు, వేగవంతమైన న్యాయం, బాధ్యతాయుతమైన వ్యవస్థను నిర్మించే దిశగా ముఖ్యమైన అడుగు. విద్యార్థుల భవిష్యత్తుకు హామీ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
పరీక్షా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
కేవలం శిక్షలు పెంచడమే కాకుండా, విచారణ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా బాధితులకు తక్షణ న్యాయం చేకూర్చడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.
"లక్షలాది మంది విద్యార్థుల కష్టాన్ని, వారి భవిష్యత్తును కొందరు అక్రమార్కులు విక్రయించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదు. ప్రతి నిమిషం పారదర్శకతకే ప్రాధాన్యమిస్తాం." — కేంద్ర ప్రభుత్వ వర్గాలు
ప్రతిపక్షాల వ్యూహంపై సర్వత్రా ఆసక్తి
మరోవైపు సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న ఈ సవరణ బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయమైనందున ప్రతిపక్షాలు కూడా బిల్లుకు సూత్రప్రాయంగా మద్దతు తెలిపే అవకాశాలున్నప్పటికీ, గత లీకేజీల బాధ్యతపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. ఏది ఏమైనా, వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు చట్టంగా మారితే దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు రాసే కోట్లాది మంది అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించడం ఖాయంగా కనిపిస్తోంది.