తెలంగాణ
బ్రేకింగ్
సంగారెడ్డిలో నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (సంగారెడ్డి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన భారత మాజీ ప్రధానమంత్రులు స్వర్గీయ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, స్వర్గీయ రాజీవ్ గాంధీల విగ్రహాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం ఘనంగా ఆవిష్కరించారు. విగ్రహాల ఆవిష్కరణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. . ఆధునిక భారతదేశ నిర్మాణంలో, ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతంలో నెహ్రూ, రాజీవ్ గాంధీలు చేసిన విశేష సేవలను, వారి త్యాగాలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జి. వివేక్ వెంకటస్వామి, స్థానిక ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్సీ శ్రీ బి. మహేష్ కుమార్ గౌడ్, టీజీఐఐసీ (TGIIC) చైర్‌పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి, నీలం మధు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. . వీరితో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంతో సంగారెడ్డి పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.