తెలంగాణ
మహిళల స్వయం సమృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే బాలు నాయక్
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/దేవరకొండ, ఆగస్టు 7): ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (నల్గొండ/దేవరకొండ, ఆగస్టు 7): మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని గౌరీకుంట తండా, గుడితండా గ్రామాల్లో చెరో రూ. 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాలను శుక్రవారం సంబంధిత అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాఖ్య భవనాలు అందుబాటులోకి రావడంతో సంఘ సమావేశాలు, పొదుపు-రుణాల నిర్వహణ, లెక్కల పర్యవేక్షణ, శిక్షణా కార్యక్రమాలు మరియు స్వయం ఉపాధి ప్రణాళికలను ఒకే చోట సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, సున్నా వడ్డీ రుణాలు, బ్యాంకు లింకేజీలు మరియు ఉపాధి శిక్షణల ద్వారా గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని పేర్కొన్నారు. మహిళా సంఘాల ఉపాధి, శిక్షణ, మార్కెటింగ్ సదుపాయాల కోసం ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక బస్సును త్వరలోనే మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు కాసర్ల వెంకటేశ్వర్లు, స్థానిక సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, కొండమల్లేపల్లి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భూతరాజు ప్రేమలత, ఏపీఎం యాదయ్య, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.