సివిల్ సప్లై అధికారుల కనుసన్నల్లోనే కోట్ల రూపాయల బియ్యం మాయం
»»» సూర్యాపేటలో నిబంధనలు గంగలో... కోట్ల రూపాయలు జేబుల్లో!
»»» మూతపడిన మిల్లులకూ కేటాయింపులు... కలెక్టర్‌కే తప్పుడు రిపోర్టులు
»»» విజిలెన్స్ విచారణతో అక్రమార్కుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు!
ప్రజాయుద్ధనౌక ప్రతినిధి (సూర్యాపేట): దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు సూర్యాపేట జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కేటాయింపుల్లో అక్రమాల మిల్లర్లు, అవినీతి సివిల్ సప్లై అధికారులు కుమ్మక్కై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నమిలేసిన ఉదంతం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి సహకరించగా, అవినీతి మిల్లర్లు అందిన బియ్యాన్ని దర్జాగా బొక్కేశారు. పౌరసరఫరాల శాఖ అధికారుల కనుసన్నల్లో, మిల్లర్ల కనుసైగల్లో కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ బియ్యం మాయమైపోవడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రూల్స్ పక్కనపెట్టి... మూతపడిన మిల్లులకూ కేటాయింపులు!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం... పాత సీఎంఆర్ బాకీ బియ్యాన్ని పూర్తిగా ఇచ్చిన మిల్లులకే కొత్త ధాన్యాన్ని కేటాయించాలి. కానీ సూర్యాపేట జిల్లా అధికారులు ఈ చట్టాలను బొందపెట్టారు. గతంలో బియ్యం ఇవ్వక డిఫాల్ట్ అయిన మిల్లులకు, అసలు నడవకుండా మూతపడిన మిల్లులకు, ఆఖరికి మిల్లింగ్ ప్రారంభమే కాని మిల్లులకు కూడా టన్నుల కొద్దీ ధాన్యాన్ని కట్టబెట్టారు. మిల్లర్ల నుంచి ముడుపుల నజరానా అందడమే ఆలస్యం... నిబంధనలను కాదని అడిగినంత కేటాయించేశారు. గడిచిన కొన్ని ఏళ్లుగా ఈ బియ్యాన్ని మిల్లర్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నా, అధికారులకు "ఇవ్వాల్సింది" అందడంతో ఏమీ పట్టనట్లు వ్యవహరించారు.
సాక్షాత్తు కలెక్టర్‌కే బురిడీ!
ప్రతినెలా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాల్సిన అధికారులు... ఏకంగా జిల్లా కలెక్టర్‌కే తప్పుడు సమాచారంతో నివేదికలు అందించినట్లు తెలుస్తోంది. మూతపడిన మిల్లులు సక్రమంగా నడుస్తున్నాయని, మిల్లుల్లో ధాన్యం నిల్వలు లేకపోయినా పుష్కలంగా ఉన్నాయని మూడు నెలల క్రితం కలెక్టర్‌కే అబద్ధపు రిపోర్టులు ఇచ్చారంటే వీరి బరితెగింపు ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.
రంగంలోకి విజిలెన్స్... బెంబేలెత్తుతున్న తోడుదొంగలు!
ఈ భారీ అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన 'స్పెషల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్' టీమ్‌ను విచారణకు ఆదేశించింది. గడిచిన రెండు వారాలుగా సూర్యాపేట జిల్లాలో డ్రైవ్ చేపట్టిన స్పెషల్ టీమ్... గత నాలుగు సంవత్సరాల కేటాయింపుల రికార్డులను, మిల్లుల్లోని వాస్తవ నిల్వలను జల్లెడ పట్టింది. ఈ విచారణలో మిల్లర్ల దోపిడీతో పాటు అధికారుల పాత్రకు సంబంధించిన పక్కా ఆధారాలు లభించినట్లు సమాచారం.
ఇంకో రెండు రోజుల్లో విజిలెన్స్ టీమ్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. నివేదిక బయటపడితే తమ ఉద్యోగం ఊడటం ఖాయమని అధికారుల్లో గుబులు మొదలై అవినీతి అధికారులు, మిల్లర్లు ఇప్పుడు గజ గజ వణుకుతున్నారు. ప్రభుత్వ ధనాన్ని ముక్కలు చేసి తిన్న ఈ తోడుదొంగలైన అవినీతి మిల్లర్లు, అవినీతి అధికారులు మరియు వారికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు.