అమర గాయకుడు గద్దర్: ప్రజల గుండెల్లో రగిలిన ఉద్యమ జ్వాల
తెలంగాణ నేల కన్న అరుదైన విప్లవ శక్తి, తన పాటనే తూటాగా మలచి, ప్రజా చైతన్యానికి నిలువెత్తు రూపంగా నిలిచిన మహనీయుడు గుమ్మడి విఠల్ రావు, ప్రపంచానికి ఆయన పరిచయం ఉన్న పేరు 'గద్దర్' ఆయన ప్రతి పాట సమాజంలో అణచివేతకు గురవుతున్న ప్రతి గుండె చప్పుడుకు ప్రతిబింబం. విద్యాభ్యాస కాలం నుంచే సమాజంలో ఉన్న ఆర్థిక, సామాజిక అసమానతలను లోతుగా పరిశీలించిన ఆయన, అక్షరానికి ఆటను, లయను జోడించి సాధారణ ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో పాడుతూ చైతన్యపరిచారు. 2023 ఆగస్టు 6న అమరుడైన ఈ ప్రజా గాయకుడు, శ్రమజీవుల స్వరమై దశాబ్దాల పాటు తన ఆటపాటలతో ప్రజలను నిద్రలేపారు. గద్దర్ 1949లో నేటి మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో గుమ్మడి శేషయ్య-లచ్చమ్మ (లచుమమ్మ) దంపతులకు జన్మించారు. ఇంజనీరింగ్ విద్యనభ్యసించినా కూడా సమాజంలో ఉన్న అసమానతలు, పీడన ఆయనను ప్రజా పోరాటాల వైపు నడిపించాయి. 1997లో ఆయనపై జరిగిన ప్రాణాంతక దాడిలో శరీరంలోకి తూటాలు దిగబడి, బుల్లెట్ శారీరకంగా ఉండిపోయినప్పటికీ, ఆయన తన పోరాట పంథాను, ఆట, పాట పాడుటను ఆపలేదు. జీవిత చరమాంకంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా కూడా మార్పు తీసుకురావచ్చని భావించి, ఓటు హక్కు ప్రాధాన్యతను, రాజ్యాంగ పరిరక్షణను విస్తృతంగా ప్రచారం చేశారు. సాంస్కృతిక పోరాటం ద్వారా ప్రజలను చైతన్యపరచడానికి గద్దర్ ఏర్పాటు చేసిన 'జన నాట్య మండలి' ఒక చారిత్రక శకానికి నాంది పలికింది. గజ్జె కట్టి, ఎర్ర తువ్వాల భుజాన వేసుకొని, చేతిలో కర్ర పట్టుకుని ఆయన వేదికపైకి వస్తే వేలాది మంది జనాలు ఊగిపోయేవారు. "నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ... నేను కాపలై ఉంటానె చెల్లెమ్మా ", "అమ్మా తెలంగాణమా... ఆకలి కేకల గానమా..." అంటూ పాడిన ఈ పాటలు కేవలం సాంస్కృతిక రూపాలు మాత్రమే కావు, తెలుగు నేల సాంస్కృతిక మూలాలను, ఉద్యమ చైతన్యాన్ని కాపాడిన అమూల్యమైన నిధులు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ గారి పాత్ర వర్ణనాతీతం. ఆయన రాసి పాడిన పాటలు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉద్యమ జ్వాలను రగిలించాయి. "పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరుతెలంగాణమా" అనే పాట తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిగా మారింది. ఆయన పాట కేవలం ఒక లయ కాదు, అది శ్రమజీవుల ఆర్తి, ఆక్రోశం, ఆశయాల సమాహారం. పేదలు, దళితులు, గిరిజనులు, కార్మికుల హక్కుల కోసం తన పాటల ద్వారా నిరంతరం పోరాడారు గద్దర్. శరీరంలో తూటా ఉన్నా, గొంతులో ప్రజా శ్వాస ఉన్నంత వరకు ప్రజల కోసమే జీవించిన ధన్యజీవి గుమ్మడి విఠల్ రావు. ఆయన నిర్మించిన సాంస్కృతిక పునాదులు, అందించిన చైతన్య స్ఫూర్తి రాబోయే తరాలకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆగస్టు 6న ఆయన భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆయన గళం, ఆయన చూపిన పోరాట పంథా ఎప్పటికీ అమరమైనవి. ప్రజా సమస్యల పట్ల స్పందించే ప్రతి గొంతులోనూ గద్దర్ జీవించే ఉంటారు. సమాజ శ్రేయస్సు కోసం, స్వేచ్ఛ-సమానత్వాల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం.
ప్రజా కవి, అమర గాయకుడు గద్దర్ గారి జ్ఞాపకార్థం ఆయనకు ఘన నివాళులు!
-ఆర్.ఎన్.ఆర్. అక్షర జ్వాల ✍️